దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా, మహారాష్ట్రతో పాటు.. ఉత్తరభారతంలో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఈ వైరస్ కాటేస్తోంది. దీంతో ప్రతి ఒక్కరు ప్రాణభయంతో వణికిపోతున్నారు.
ముఖ్యంగా వృద్ధుల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారయ్యింది. కరోనా బారినపడి ఆస్పత్రి పాలైన వృద్ధులను కుటుంబసభ్యులు పట్టించుకోకుండా వదిలేస్తున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వచ్చిందంటే చాలు వృద్ధులు వణికిపోతున్నారు. భవిష్యత్తును తలుచుకుని భయంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో అలాంటి ఘటనే చోటుచేసుకున్నది. కరోనా పాజిటివ్ రావడంతో నాగ్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలోని కొవిడ్ వార్డులో చేరిన ఓ 81 ఏండ్ల వృద్ధుడు బాత్రూంలోకి వెళ్లి ఆక్సిజన్ పైప్‌తో ఉరేసుకున్నాడు. నాగ్‌పూర్ ఆస్పత్రిలో ఈ విషాదకర ఘటన జరిగినట్టు వైద్యులు వెల్లడించారు.