మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదివారం చంద్రాపూర్ జిల్లా, బల్లార్పూర్ నియోజకవర్గంలో ఎన్డీఏ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ఏపీలో వైసీపీని మామూలుగా కొట్టలేదని, మహారాష్ట్రలోనూ అలాగే మూడోసారి మహాయుతి సర్కారు రావాలని కోరారు.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ తన సహజ శైలికి భిన్నంగా ప్రసంగాలు చేస్తున్నారు. శినసేన - జనసేన సిద్దాంతం ఒకటేనని చెప్పుకొచ్చారు. హిందీ, మరాఠీ భాషల్లో తన ప్రచారం కొనసాగించారు. తనకు మరాఠా ప్రజలు.. ఛత్రపతి శివాజీ, బాలాసాహెబ్ థాక్రే పైన తన అభిమానం ఎలాంటిదో వివరించారు.
మహారాష్ట్ర భవిష్యత్‌కు బీజేపీ కూటమి గెలుపు అవసరమని పేర్కొన్నారు. తాను ఏపీలో వైసీపీని ఓడించిన అంశాన్ని ప్రతీ సభలోనూ వివరించారు. ఇక, తెలంగాణ రాజకీయాల గురించి పవన్ తన ప్రచారంలో ప్రస్తావన చేశారు.
తెలంగాణ పోరాటాల గడ్డ అని పేర్కొన్న పవన్.. అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతీ నెలా ఇస్తామని చెప్పిన ఆర్దిక సాయం ఇవ్వటం లేదని పవన్ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన మాట కాంగ్రెస్ నిలబెట్టుకోవటం లేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పవన్ ప్రచార వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.