దేశంలో ప్రవేశపెట్టిన అతి తక్కువ సమయంలో మంచి ప్రజాధారణ పొందిన వందే భారత్ రైళ్లలో త్వరలోనే స్లీపర్ క్లాస్ రైళ్లు అందుబాటులోకిరానున్నాయి. వీటిని ప్రస్తుతం ఉన్న వందే భారత్ రైళ్ల కంటే మరింత అధునాతనంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ కొత్త రైళ్లు త్వరలోనే కొత్త హంగులతో పట్టాలెక్కనున్నాయి. ఈ తరహా రైళ్లను వచ్చే యేడాది మార్చి నెలాఖరు నుంచి లేదా ముందుగానే ప్రవేశపెట్టే అవకాశం ఉందని రైల్వే ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఈ రైళ్లకు వేగం, సౌకర్యం, సమయ వేళలు అనుకూలంగా ఉండటంతో ప్రయాణికులు వీటిని ఎక్కేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో స్లీపర్ బోగీలతో ప్రత్యేకంగా వందేభారత్ రైళ్లు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ రైళ్ళను చెన్నైలోని ఐసీఎఫ్‌లో తయారు చేస్తున్నారు. వందేభారత్ స్లీపర్ రైళ్లు ఇప్పటికే సిద్ధంకాగా విజయవాడ డివిజనకు రెండు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు త్వరలోనే ట్రైల్ రన్ నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
విజయవాడ డివిజన్‌లో నడుస్తున్న సికింద్రాబాద్ - విశాఖపట్నం, విజయవాడ - చెన్నై సెంట్రల్ రైళ్లకు ఎక్కువ డిమాండ్ ఉండగా స్లీపర్ తరగతి బోగీలతో నడిచే వందేభారత్‌కు మరింత ఆదరణ పెరిగే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ రైళ్ల కోసం ఇప్పటికే డివిజన్ వ్యాప్తంగా పట్టాల పటిష్టతను పెంచారు. ఇందుకుగాను భారీగా సాధారణ రైళ్లు రద్దు చేసి నిర్వహణ పనులు చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి ప్రవేశపెట్టాలని ముందుగా నిర్ణయించినా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనుకున్న సమయం కంటే ముందుగానే రైలును ప్రవేశపెట్టేందుకు ఆ శాఖ యోచిస్తోంది.
మరోవైపు, ప్రయాణికులు సులువుగా పై బెర్తులకు ఎక్కేలా డిజైన్ చేశారు. మొత్తం 857 బెర్తుల్లో 37 బెర్తులను సిబ్బంది, ప్యాంట్రీకార్ సిబ్బందికి కేటాయించారు. బెర్తులు మరింత వెడబ్లుగా, విశాలంగా ఉండేలా డిజైన్ చేశారు. ప్రతి బోగీలో మూడు మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఇపుడున్న రైళ్లతో పోలిస్తే నమూనా కూడా పూర్తి స్థాయిలో మార్పులు చేశారు. కొత్తగా ప్రవేశపెట్టనున్న స్లీపర్ బోగీల వందే భారత్ రైలు కొత్త చిత్రాలను ఇటీవల రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేసిన విషయం తెల్సిందే.