దేశంలో మరోమారు పూర్తి స్థాయి లాక్ డౌన్ కు సన్నాహాలు జరుగుతున్నాయా?.. ఇందుకు కేంద్రం పావులు కదుపుతోందా?.. ఈ సంకేతాల వల్లనే రైల్వే శాఖ ఆగస్టు వరకు టిక్కెట్లను రద్దు చేసిందా?.. అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
ఈ నెలాఖరు వరకూ మాత్రమే రైళ్లను నడుపుతామని, ఆపై జూలై 1 నుంచి ఆగస్టు 12 వరకూ సాధారణ రైళ్లను నడపబోమని రైల్వే శాఖ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే.
43 రోజుల పాటు ఇప్పటికే బుక్ చేసుకున్న టికెట్లన్నీ క్యాన్సిల్ అయినట్టేనని రైల్వేశాఖ స్పష్టం చేసింది. ముందస్తు బుకింగ్స్ చేసుకున్న వారి డబ్బులను వారి ఖాతాల్లోకే జమ చేస్తామని కూడా ప్రకటించింది.
ఇక ఈ ప్రకటనతో మరోసారి లాక్ డౌన్ ఖాయమన్న విశ్లేషణ తెరపైకి వచ్చింది. ప్రయాణాలు చేయాలని భావించిన వారు ఈ ఐదు రోజుల్లోనే గమ్యాలకు చేరుకోవాలని, ఆ తరువాత మరో విడత లాక్ డౌన్ అమలులోకి వస్తుందని పలువురు అంటున్నారు. ఈ విషయంలో సోషల్ మీడియాలో సైతం జూలై 1 నుంచి మరో లాక్ డౌన్ అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
మరో నెలన్నర పాటు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తే, ఆసుపత్రుల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారు రికవరీ అవుతారని, ఆ సమయానికి కేసులు తగ్గడంతో పాటు, వైరస్ ను నిరోధించే డ్రగ్స్ సైతం విరివిగా మార్కెట్లోకి వస్తాయన్న ఆలోచనతో కేంద్రం వున్నట్టు సమాచారం.