ఉత్తర భారతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రతుపవనాల రాకతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అయితే, ఉత్తరాది రాష్ట్రాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి.
ముఖ్యంగా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఆదివారం పిడుగులు పడి 68 మంది చనిపోగా.. భారీ సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. యూపీలోనే 41 మంది ప్రాణాలు కోల్పోగా, మధ్యప్రదేశ్‌లో ఏడుగురు చనిపోయారు. రాజస్థాన్‌లో పిడుగుపాటుకు 20 మంది మృతి చెందారు.
రాజస్థాన్‌లోని వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు లోనై 20 మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు. జైపూర్ సమీపంలోని అంబర్ కోట వద్ద పర్యాటకులు సెల్ఫీ తీసుకుంటుండగా పిడుగు పడింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 12 మంది గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.
మరోవైపు, యూపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడటంతో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నారు. పిడుగుపాటు ఘటనలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ఇదిలావుంటే, పిడుగుపాటు ఘటనలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రధాని సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందిస్తామన్నారు.