మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళ దారుణానికి పాల్పడ్డారు. రీల్స్ కోసం అమ్మాయిలను కిడ్నాప్ చేసింది. ఇందుకోసం ఆ మహిళ సారథ్యంలో ఏకంగా ఓ ముఠానే ఏర్పడటం గమనార్హం. తోటి యువతులను కిడ్నాప్ చేసి దారుణంగా కొడుతూ ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఎంపీలోని జబల్‌పూర్‌లో జరిగిన ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల ఓ యువతిని ఈ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. అనంతరం ఆమె జుత్తు పట్టుకుని విచక్షణా రహితంగా కొడుతూ కాళ్లతో తన్నుతూ వీడియో చిత్రీకరించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. ఈ వీడియో ఆధారంగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దాడికి పాల్పడిన గ్యాంగ్‌లోని ఇద్దరు 17 ఏళ్ల బాలికతో పాటు మరో యువతిని అరెస్టు చేశారు. కేవలం సోషళ్ మీడియాలో పాపులారిటీ కోసమే వీరు ఈ దారుణాలకు పాల్పడుతున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ గ్యాంగ్ గతంలోనూ ఇదే తరహాలో మరికొంతమంది యువతులపై దాడులు చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు ఈ కేసును మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.