Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాకిస్థాన్‌కు సమాచారం ఇచ్చాకే బాలాకోట్‌పై దాడి చేశాం : ప్రధాని నరేంద్ర మోడీ

narendra modi

వరుణ్

, మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (10:46 IST)
గత 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు పాకిస్థాన్ ఆక్రమిత భూభాగంలోని బాలాకోట్‌లో భారత్‌ వైమానిక దళం దాడులు జరిగింది. ఈ దాడులు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. పుల్వామా దాడికి ప్రతీకారంగా ముష్కరులకు మన వాయుసేన ముచ్చెమటలు పట్టించింది. తాజా ఎన్నికల్లోనూ ఈ ఘటన మరోసారి తెరపైకి వచ్చింది. ఈ దాడులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. బాలాకోట్‌పై వైమానిక దాడుల గురించి పాకిస్థాన్‌కు సమాచారం ఇచ్చిన తర్వాతే మీడియాకు వెల్లడించామన్నారు.
 
కర్ణాటకలోని బగల్‌కోట్‌ ఎన్నికల ప్రచారంలో మోడీ ఈ ఘటనను ప్రస్తావించారు. 'ఇది నవ భారత్‌. మనకు హానీ తలపెట్టే ముష్కరులు వారి సొంత దేశంలో నక్కినా వేటాడి మరీ చంపేస్తాం. వెనుక నుంచి దాడి చేయడంపై మోదీకి నమ్మకం లేదు. శత్రువుతో ఎదురుగా నిలబడే పోరాడుతాం. 2019 నాటి బాలాకోట్‌ దాడుల సమాచారాన్ని దాయాది నుంచి దాచిపెట్టాలనుకోలేదు. దాడి తర్వాత అక్కడ జరిగిన విధ్వంసాన్ని శత్రువుకు ముందే చెప్పాం' అని ప్రధాని తెలిపారు.
 
'బాలాకోట్‌ వైమానిక దాడుల గురించి మీడియాను పిలిచి వెల్లడించాలని నేను మన బలగాలకు చెప్పా. అయితే, అంతకంటే ముందు పాకిస్థాన్‌కు ఈ విషయం చెప్తానన్నా. ఆ రోజు రాత్రి దాయాది దేశ అధికారులకు ఫోన్‌ చేస్తే వారు అందుబాటులోకి రాలేదు. అందుకుని.. బలగాలను మరికొద్ది సేపు వేచి ఉండమన్నా. పాక్‌కు దీని గురించి చెప్పిన తర్వాతే.. ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించాం. మోడీ దేన్నీ దాచిపెట్టడు. ఏది చేసినా బహిరంగంగా చేస్తాడు' అని నాటి సంఘటనలను ప్రధాని వివరించారు.
 
2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను జైషే ఉగ్రవాదులు బలితీసుకున్న విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా భారత వాయుసేన ఫిబ్రవరి 26న వైమానిక దాడులు చేపట్టింది. పాక్‌ భూభాగంలోని బాలాకోట్‌లో గల జైషే మహ్మద్‌ ఉగ్ర స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఉగ్రవాదాన్ని తాము ఎన్నటికీ సహించబోమని ఈ ఘటనతో భారత్‌.. పాక్‌ సహా ప్రపంచదేశాలకు గట్టి సందేశమిచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిషీల్డ్ టీకా తీసుకున్న వారిలో దుష్ప్రభావాలు... అంగీకరించిన ఆస్ట్రాజెనెకా!!