దేశంలోని 140 కోట్ల జనభాలో 59 మందికి కంటి నిండా కునుకు లేదట. ఎలాంటి అంతరాయం లేకుండా కనీసం ఆరు గంటల పాటు ఏకధాటిగా నిద్రపోలేకపోతున్నట్టు తేలింది. ఈ నెల 14వ తేదీన "ప్రపంచ నిద్ర దినం". ఈ సందర్భంగా లోకల్ సర్కిల్ అనే సంస్థ దేశ వ్యాప్తంగా ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా 343 జిల్లాల్లోని 40 వేల మంది అభిప్రాయాలను సేకరించారు. వీరిలో 61 శాతం మంది పురుషులు, 59 శాతం మంది మహిళలు ఉన్నారు.
ఈ సర్వే సంస్థ నివేదిక ప్రకారం 39 శాతం మంది మాత్రమే ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోతున్నారట. మరో 39 శాతం మంది నాలుగు నుంచి ఆరు గంటల పాటు నిద్రపోతున్నారు. 2 శాతం మంది మాత్రమే కంటికి సరిపడా నిద్రపోతున్నారు. వీరు ప్రతి రోజూ 8 నుంచి 10 గంటలపాటు నిద్రపోతున్నట్టు నివేదిక తెలిపింది. 20 శాతం మంది 4 గంటలు కూడా నిద్రపోవడం లేదు. మొత్తంగా చూసుకుంటే 59 శాతం మంది ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆరు గంటలు కూడా నిద్రపోవడం లేదు.
సరైన నిద్రకు నోచుకోకపోవడానికి గల కారణాలను కూడా లోకల్ సర్కిల్ వెల్లడించింది. ఆలస్యంగా నిద్రపోవడం, త్వరగా లేవాల్సి రావడం, సెల్‌ఫోన్లు, దోమలు, బయటి శబ్దాలు, పిల్లల అల్లరి కారణంగా సరిగా నిద్రపోలేకపోతున్నట్టు సర్వేలో పాల్గొని పలువురు వెల్లడించారు.