దేశంలో ఆత్మహత్యాయత్నం అనేది నేరం కాదని కేంద్ర హోంశాఖ చెపుతోంది. ఈ మేరకు చట్ట సవరణ చేసేందుకు సిద్ధమైంది. బలవంతంగా ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించేవారిని భారత శిక్షాస్మృతిలోని 309 సెక్షన్ కింద అదుపులోకి తీసుకొని పోలీసులు కేసులు నమోదు చేస్తుంటారు. ఆమరణ నిరాహార దీక్షల సందర్భంగా ఇలాంటి అరెస్టులను చూస్తుంటాం. అయితే, ఈ చర్య పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు విరుద్ధమని కొన్ని సామాజిక, మానవతావాద సంఘాలు వాదిస్తున్నాయి.
భారతదేశంలో జన్మించిన ప్రతి పౌరుడికి ఆత్మగౌరవంతో జీవించే హక్కుని ఆర్టికల్ 21, ఆర్టికల్ 14 కల్పించాయని, ఆత్మహత్యాయత్నం చేయడం, అందుకు బయట నుంచి సహకారం అందించడం అనేది హక్కుల్లో భాగమేననేది ఈ సంఘాల ప్రధాన వాదన. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 309ని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర జాబితాలోని ఈ అంశానికి దాదాపు 18 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు మద్దతు పలకడంతో కేంద్రం పని తేలికైపోయింది. చట్టాల సంపుటి (రాజ్యాంగం) నుంచి ఈ సెక్షన్‌ను త్వరలోనే తొలగించనున్నట్టు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరీభాయ్ పారతీభాయ్ చౌధురీ బుధవారం రాజ్యసభకు తెలిపారు.
అయితే, ఈ సెక్షన్ ఏం చెపుతోందన్న విషయాన్ని పరిశీలిస్తే.. ఆత్మహత్యాయత్నం శిక్షార్హ నేరమని ఈ సెక్షన్ చెబుతోంది. దీనికింద అభియోగాలు రుజువైతే.. గరిష్ఠంగా ఒక ఏడాది శిక్ష లేక జరిమానా లేదంటే రెండూ అనుభవించాల్సి ఉంటుంది. ‘నేరుగా ఆత్మహత్యాయత్నం చేసినా, అందుకు బయట నుంచి సహకారం, ప్రేరణ అందించినా శిక్షార్హులు అవుతారు అంటూ ‘ఆత్మహత్యాయత్నా’నికి నిర్వచనం ఇచ్చింది.