థర్డ్ గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ పేరిట తాజాగా నిర్వహించిన సర్వేలో భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్ధాలు గడుస్తున్నప్పటికీ బానిసత్వం మాత్రం పోలేదని తేలింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 4.6 కోట్ల మంది ప్రజలు ఇంకా బానిస జీవనం కొనసాగిస్తున్నారని సర్వే తేల్చింది.
కేవలం భారత దేశంలోనే 1,83,54,700 మంది ప్రజలు ఇంకా బానిసలుగా బతుకుతున్నారని సర్వే తేల్చింది. ఇక బానిసలకు జన్మించిన వారి పిల్లలను కూడా బానిసలు లేదా సెక్స్ వర్కర్లు, అదీ కాకపోతే కూలీలుగా వాడుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది.
2014లో ప్రపంచ వ్యాప్తంగా 3.58 కోట్ల మంది బానిసలుగా బతుకుతున్నారని నివేదిక పేర్కొనగా, వారి సంఖ్య 2016 నాటికి 4.6 కోట్లకు చేరిందని ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌లో తక్కువ వేతనానికే కార్మికులను నియమించుకుని వారి శ్రమను దోపిడీ చేస్తున్నట్లు సర్వేలో తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో హ్యూమన్ రైట్స్ గ్రూప్ వాక్ ఫ్రీ ఫౌండేషన్ సంస్థ ఇచ్చిన ర్యాంకింగ్స్‌లో భారత్ నాలుగో స్థానంలో ఉన్నది. భారత్‌తో పాటు చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాల్లో కూడా శ్రమ దోపిడీ భారీ స్థాయిలో జరుగుతుందని తాజా సర్వేలో తేలింది.