Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమూల్ ఐస్‌క్రీమ్‌లో జెర్రీ... ఫోటోతో పాటు పోస్టును తొలగించాలని హైకోర్టు ఆదేశం

Advertiesment
ice cream box

సెల్వి

, శనివారం, 6 జులై 2024 (09:21 IST)
పిల్లాపెద్దా ఇలా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టపడి ఆరగించే అమూల్ ఐస్ క్రీమ్‌లో జెర్రీ కనిపించింది. ఈ విషయాన్ని ఓ మహిళా కష్టమర్ ఫోటో తీసి సోషలో మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలను జారీచేసింది. ఐస్ క్రీమ్‌లో జెర్రీ ఉన్నట్టు పెట్టిన ఫోటోతో పాటు పోస్టును కూడా తొలగించాలని ఆదేశించింది. అలాగే, మరే ఇతర సామాజిక మాధ్యమాల్లోనూ ఈ ఫొటో పోస్టు చేయొద్దని స్పష్టం చేసింది. అమూల్ సంస్థ వేసిన కేసులో మహిళ విచారణకు గైర్హాజరైన నేపథ్యంలో కోర్టు ఈ మేరకు ఆదేశించింది.
 
ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే, సదరు మహిళతో పాటు మరో నెటిజన్‌పై గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (అమూల్) కోర్టును ఆశ్రయించింది. ఐస్ క్రీమ్ జెర్రె ఫొటోను తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ అభ్యర్థించింది. తమ ఉత్పత్తుల్లో నాణ్యత ఉండేలా అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటామని, బహుళ దశల్లో తనిఖీలు చేస్తామని అమూల్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తమ కేంద్రాలకు ఐఎస్ఐ సర్టిఫికేషన్ ఉందని, ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ నిబంధనలను తూ.చా తప్పకుండా పాటిస్తామని వెల్లడించింది. 
 
పాల సేకరణ నుంచి మార్కెటింగ్ వరకూ ప్రతి దశలోనూ నాణ్యత పెంపొందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. తమ ఉత్పత్తులు కలుషితమయ్యే అవకాశమే లేదని స్పష్టం చేసింది. జెర్రె ఉన్న ఐస్ క్రీమ్‌ను పరీక్షల కోసం తమకు అప్పగించేందుకు మహిళ తిరస్కరించిందనే విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. కాగా, ఈ కేసుకు సంబంధించి అమూల్ సంస్థ ముందుగానే పంపించిన నోటీసులకు మహిళ స్పందించక పోవడాన్ని కోర్టు ప్రస్తావించింది. 
 
పరీక్ష నిమిత్తం ఐస్ క్రీమ్‌ను సంస్థకు అప్పగించేందుకు నిరాకరించడం, ఘటనపై దర్యాప్తునకు సహకరించకపోవడం, విచారణ సమయంలో ఇద్దరు నెటిజన్లు కోర్టు ముందు హాజరు కాకపోవడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు నెటిజన్లు పెట్టిన ఫొటో, పోస్టును తక్షణం తొలగించాలంటూ ఆదేశించింది. విచారణను మరో తేదీకి వాయిదా వేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

5079 నాటికి ప్రపంచం అంతమైపోతుంది : అంధ కాలజ్ఞాని బాబా వంగా!!