కరోనా వైరస్ కేవలం మనుషులకే కాదు జంతువులకు కూడా సోకుతుంది. ఇటీవల న్యూయార్క్ నగరంలోని ఓ జంతు ప్రదర్శనశాలలో ఉండే ఓ పులికి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. దీంతో ఆ జూ పార్కులోని జంతువులన్నింటినీ ఒకదానితో ఒకటి కలుసుకోకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఇదే విధానాన్ని మన దేశంలోని జంతు ప్రదర్శనశాలల్లో కూడా అమలు చేస్తున్నారు. కరోనా వైరస్ భయంతో జంతు ప్రదర్శనశాలలో జంతువుల సంతానోత్పత్తికి తాత్కాలికంగా బ్రేక్ వేశారు. అహ్మదాబాద్ నగరంలోని కమలానెహ్రూ జూలాజికల్ గార్డెన్‌లో ఉన్న పులులు, సింహాల జంటలు కలవకుండా దూరంగా ఉంచారు.
జంతుప్రదర్శనశాలలో పులులు, సింహాల జంటల మధ్య సంతానోత్పత్తికి ఈ సీజన్ సరైన సమయం కావడంతో ఇవి కలిసేలా ఒకే గుహలో వదిలివేస్తుండటం సర్వసాధారణం. కాని కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పులులు, సింహాల జంటలు కలవకుండా ముందుజాగ్రత్త చర్యగా వాటిని వేర్వేరు గుహల్లో ఉంచామని జూ సూపరింటెండెంట్ భరత్ సిన్హా వివల్ చెప్పారు.
జంతువుల జంటల మధ్య సంతానోత్పత్తిని నిలిపి వేయడంతో పాటు పశువైద్యాధికారుల బృందం నిత్యం వీటిని పరీక్షిస్తోంది. పులులు, సింహాల ప్రవర్తనలో ఏమైనా మార్పులు వచ్చాయా? వీటికి శ్వాసకోశ ఇబ్బందులున్నాయా? ముక్కు కారడం, దగ్గు సమస్యలున్నాయా అని పశువైద్యులు పరీక్షిస్తున్నారు.