మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
లాక్డౌన్ నుంచి తాను ప్రతి రోజు పనిచేస్తున్నానని, భగవంతుడు తనకు కొంత విరామం ఇవ్వాలని అనుకున్నట్టు ఉన్నాడని, అందులో భాగంగానే తనకు కరోనా సోకినట్టు ఉందని ఫడ్నవీస్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. తనతో కాంటాక్ట్ అయిన వారు కూడా కరోనా టెస్టు చేయించుకోవాలని ఫడ్నవీస్ సూచించారు.
కరోనా వైరస్ సోకిన దేవేంద్ర ఫడ్నవీస్ త్వరగా కోలుకోవాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు. అయితే, కొందరు నెటిజన్లు మాత్రం తనదైనశైలిలో జోకులు పేల్చుతున్నారు. వదిన చేతి అప్పడాలు తినాలని, పతంజలి కోర్నిల్ ట్యాబ్లెట్లు వాడాలని, గోమూత్రం తాగాలని సూచించారు.
అలాగే, శివసేన నేత సంజయ్ రౌత్ స్పందించారు. ఫడ్నవీస్ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన రౌత్.. బయట కరోనా పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఆయనకు ఇప్పుడు అర్థమై ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారంటూ ఇటీవల ప్రతిపక్ష బీజేపీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో సంజయ్ రౌత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.