చెన్నై మహానగరానికి మరోమారు వానగండం పొంచివున్నట్టు కనిపిస్తోంది. గత యేడాది డిసెంబరు నెలలో కురిసిన భారీ వర్షాలకు చెన్నై నగరం అస్తవ్యస్తమైన విషయం తెల్సిందే. దీనినుంచి పూర్తిగా కోలుకున్న చెన్నై నగరానికి ఇపుడు తుఫాను ముప్పు పొంచివుంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బుధవారం ఉదయం చెన్నైకి తూర్పు దిశగా 70 కిలోమీటర్ల దూరంలో ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇది గంటకు 11 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోంది. ఈ వాయుగుండం చెన్నై నుంచి ఉత్తర దిశగా ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా వైపు పయనించే అవకాశం ఉన్నట్టు చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. దీనిప్రభావం కారణంగా 48 గంటల్లో తీవ్ర వాయుగుండంగా, తదుపరి తుఫానుగా మారే అవకాశముందన్నారు. వాయుగుండం ప్రభావంతో తమిళనాడులోని కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. చెన్నైలో ఈ దురుగాలులతో కూడి వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి.
చెన్నై నంగరంలోని చెంబరంబాక్కం చెరువుకు భారీగా వర్షపునీరు వచ్చి చేరుతోంది. మరోవైపు.. చెన్నై శివారులో మంగళవారం రాత్రి వరకు 17.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నాగపట్నం, పుదుచ్చేరి, రామేశ్వరం ఓడరేవుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అప్రమత్తమైన ప్రభుత్వం గత డిసెంబరులో ముంచెత్తిన భారీ వరదలను దృష్టిలో పెట్టుకుని తమిళనాడు ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి, హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించారు.