రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు... కన్న కుమారుడికి చీరకట్టి, నగలు ధరింపజేసి అందంగా అలంకరించి అంతమొదించారు. ఇంటిసమీపంలోని నీట ట్యాంకులో దూకి భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు బలవన్మరణం చెందారు. ఆస్తి వివాదాలే కారణమని సూచిస్తూ సూసైడ్ లేఖ రాశిపెట్టారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతులను బార్మర్ జిల్లాకు చెందిన శివ్‌లాల్ మేఘ్వాల్ (35), అతని భార్య కవిత (32), వారి కుమారులు బజరంగ్ (9), రామ్ దేవ్ (8)లుగా గుర్తించారు. తమ ఇంటికి సమీపంలో ఉన్న నీటి ట్యాంకులో దూకి నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం నుంచే వీరి మొబైల్ ఫోన్లు స్విచ్ఆఫ్ రావడంతో అనుమానం వచ్చిన శివ్‌లాల్ తమ్ముడు పక్కింటివారికి ఫోన్ చేసి ఇంట్లో చూడమన్నారు. వారు వెళ్లి చూడగా ఇంటికి తాళం వేసివుండటంతో బంధువులకు సమాచారం అందించారు. బుధవారం ఉదయం బంధువులు ఇంటికి వచ్చి గాలించగా, నీటి ట్యాంకులో నలుగురు మృతదేహాలు తేలాడుతూ కనిపించాయి.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద వచ్చిన డబ్బుతో వేరే ఇల్లు కట్టుకుందామంటే నా తల్లి, తమ్ముడు అడ్డుపడుతూ, వాటా ఇవ్వకుండా నరకం చూపిస్తున్నారు. వారి వేధింపులు భరించలేకపోతున్నాం అని ఆత్మహత్య లేఖలో వారు పేర్కొన్నారు. తమ నలుగురి అంత్యక్రియలు కూడా తమ ఇంటి ముందే జరిపించాలని ఆ లేఖలో కోరడం ప్రతి ఒక్కరినీ కలిచివేసింది.
ఈ ఘటనలో ప్రతి ఒక్కరినీ కలిచివేసిన అంశం ఒకటివుంది. తల్లి కవిత తన చిన్న కొడుకు రామ్‌దేవ్‌ను అలంకరించిన తీరే అది. చనిపోయే ముందు ఆ తల్లి కన కొడుకును అచ్చం తనలాగే తయారుచేసింది. తన బట్టలు వేసి, దుపట్టా చుట్టింది. కళ్లకు ఎంతో ప్రేమగా కాటుక పెట్టి, తన బంగారు నగలతో అలంకరించింది. ఆ తర్వాత ఆ పసివాడిని తనతో పాటే మృత్యువులోకి తీసుకెళ్లింది. ఈ దృశ్యం గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ కన్నీరు కారుస్తున్నారు. తల్లి ప్రేమలోని ఈ విషాదకరమైన కోణం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.