Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామమందిరమే ప్రధాన ప్రచారాస్త్రంగా బీజేపీ వ్యూహం!

Advertiesment
ayodhya city
, సోమవారం, 25 డిశెంబరు 2023 (12:31 IST)
వచ్చే యేడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రామమందిర ఆలయ నిర్మాణమే ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకుని ముందుకు వెళ్లాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ పదాదికారుల సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంకేతాలు ఇచ్చారు. 2024 ఎన్నికల్లో అత్యధిక శాతం ఓట్లతో విజయం సాధించడమే మన లక్ష్యమని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 
 
ఇదిలావుంటే, ఈ నెల 30వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. అక్కడ నుంచి 15 కిలోమీటర్ల మేర రోడ్‌షోగా వెళ్లి.. పునరుద్ధరించిన అయోధ్య రైల్వేస్టేషన్‌ని ప్రారంభించి, వందేభారత్‌, అమృత్‌భారత్‌ రైళ్లకు జెండా ఊపుతారు! ఆ తర్వాత మళ్లీ విమానాశ్రయం వద్దకు చేరుకుని భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత.. జనవరి 22న అయోధ్యలో అట్టహాసంగా రామమందిర ప్రారంభోత్సవం జరుగుతుంది. ఆ కార్యక్రమం జరిగిన కొద్దిరోజులకే.. ఆ వేడుకల తాలూకూ సందడి ఇంకా దేశ ప్రజల హృదయాల నుంచి చెరిగిపోకముందే.. 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు విడుదలవుతుంది. 
 
ఈ ఎన్నికల్లో రామమందిరమే ప్రధాన ప్రచారాస్త్రంగా వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ.. దానికి అనుగుణంగా అత్యంత చాకచక్యంగా రూపొందించుకున్న ఎన్నికల ప్రణాళిక ఇది. ఈ మేరకు.. రామమందిర ప్రారంభాన్ని ఒక చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణిస్తూ బీజేపీ ఒక బుక్‌లెట్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. రామమందిర ఉద్యమంలో బీజేపీ పాత్ర, ఆలయ నిర్మాణం కోసం చేసిన కృషి గురించి వివరిస్తూనే.. ప్రతిపక్షాలు ఆ మందిర నిర్మాణానికి ఎన్ని అడ్డంకులు సృష్టించాయనే వివరాలన్నింటినీ ఆ బుక్‌లెట్‌లో రూపొందిస్తున్నారు. 
 
తద్వారా మరింతమంది కొత్త ఓటర్లను ఆకర్షించి.. పార్టీ ఓటింగ్‌ శాతాన్ని కనీసం పది శాతం మేర పెంచుకోవాలని గతవారం జరిగిన పార్టీ పదాధికారుల సమావేశంలో నిర్ణయించారు. అలాగే ప్రతి నియోజకవర్గంలోనూ 50 శాతం ఓటింగ్‌ సాధించడంపై దృష్టి కేంద్రీకరించాలని నిశ్చయించారు. 2024లో అత్యధిక శాతం ఓట్లతో విజయం సాధించడమే మన లక్ష్యం అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈ సమావేశంలో ప్రకటించారు. 
 
బీజేపీకి బలహీనమైన నియోజకవర్గాలంటూ ఉండబోవని.. అన్నింటినీ గెలిచే నియోజకవర్గాలుగానే భావించి, కష్టించి, విజయం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు దిమ్మెరపోయేలా 2024 విజయం అన్ని రికార్డులనూ బద్దలుగొట్టాలన్నారు. లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించేంతవరకూ వేచిచూడాల్సిన అవసరం లేదని.. వెంటనే ప్రచార రంగంలోకి దూకాలని సమావేశంలో బీజేపీ అగ్రనేతలు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 
 
ఇంటింటికీ వెళ్లి బీజేపీ సిద్ధాంతం, బీజేపీ నెరవేర్చిన చరిత్రాత్మక కర్తవ్యాలు, మోడీ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి గురించి ప్రచారం చేయాలని.. మోడీని అసాధారణ మెజారిటీతో మళ్లీ ప్రధానమంత్రిని చేయాలని అమిత్‌ షా పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం కాక.. పార్టీ ఏం చేసిందో చెప్పడమే ప్రచారంలో ప్రధానంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా తొలిసారి ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నించాలని సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుక్కల దాడిలో మరో చిన్నారి మృతి... ఎక్కడ?