ఎంపీ సీటుపై బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ రాజా సింగ్ కన్నేశారు. ప్రస్తుతం గోషా మహల్ వద్దు.. పార్లమెంటే ముద్దు అంటున్నారు రాజా సింగ్. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే ఆయన కసరత్తు ప్రారంభించారు.
బలమైన అభ్యర్థులను పార్లమెంటుకు పోటీ చేయించాలని బీజేపీ కూడా భావిస్తోంది. దీంతో 2024లో రాజాసింగ్ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయడం దాదాపు ఖాయమే అని సమాచారం.
గత పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఇందులో మూడు సీట్లు ఉత్తర తెలంగాణ ప్రాంతానివే. ఉత్తర తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నారనేది గత ఎన్నికలు స్పష్టం చేశాయి.
ఇప్పుడు రాజాసింగ్ కూడా తాను ఎంపీగా పోటీ చేయడానికి ఈ ప్రాంతం అయితే బెటర్ అనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన ఎమ్మడి మెదక్ జిల్లాలోని జహిరాబాద్ లోక్‌సభ స్థానాన్ని ఎంపిక చేసుకున్నారు. ఈ సీటు నుంచి తాను పోటీ చేస్తే కచ్చితంగా గెలుస్తానని ఆయన నమ్మకంగా ఉన్నారు.