Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడు ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తుది తీర్పు - సర్వత్రా ఉత్కంఠ - జేకేలో భద్రత హైఅలెర్ట్

supreme court
, సోమవారం, 11 డిశెంబరు 2023 (09:20 IST)
జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఉపసంహరిస్తూ గత 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుధీర్ఘంగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పును సోమవారం వెలువరించనుంది. ఈ అంశంపై వేర్వేరు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ వరకు విచారణ జరిపింది. సెప్టెంబరు 5న రిజర్వులో ఉంచిన తీర్పును సోమవారం వెలువరించనున్నట్టు వెబ్‌సైట్‌లో సుప్రీంకోర్టు పేర్కొంది. 
 
కాగా 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. దీనిని స్థానిక రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, ఆర్టికల్ 370 రద్దుపై తీర్పు వెలువడనున్న నేపథ్యంలో కాశ్మీర్లో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టింది. 
 
రెండు వారాలుగా కాశ్మీర్ లోయలోని 10 జిల్లాల్లో భద్రతా ఏర్పాట్లపై పోలీసులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొందరు నాయకులను అదుపులోకి తీసుకోగా మరికొందరిని గృహనిర్బంధంలో ఉంచారు. ప్రజలను రెచ్చగొట్టేవారిపై చర్యలు తప్పవని స్థానిక పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. సోమవారం వెలువడబోయే తీర్పు పట్ల స్థానిక రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. 
 
ఆర్టికల్ 370 రద్దుకు అనుకూలంగా తీర్పు వచ్చినా శాంతిభద్రతలకు తమ పార్టీ విఘాతం కలిగించబోదని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. తీర్పును ఎవరూ రాజకీయం చేయరాదని, దానిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని భారతీయ జనతా పార్టీ నేతలు కోరుతున్నారు. కాగా 370 అధికరణం రద్దుకు వ్యతిరేకంగా పోరాడేందుకు జమ్మూకాశ్మీర్‌కు చెందిన పార్టీలు గుప్కార్ అలయెన్స్ ఏర్పడిన విషయం తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్ రైలు.. ఏ మార్గంలో అంటే...