పూరీ జగన్నాథ రథ చక్రాలే మనలో చాలా మందికి తెలుసు.. కానీ, అక్కడ దేవుడి విగ్రహంలోని బ్రహ్మపదార్థాన్నే మారుస్తారట.. అసలు ఆ బ్రహ్మపదార్థంలో ఏం ఉంటుంది? ఎందుకు మారుస్తారు.? వంటి అనేక ప్రశ్నలు మరోమారు సోమవారం నుంచి మొదలవుతాయి. చంద్రమండలానికి మార్గం కనుగొన్న శాస్త్రవేత్తలు ఉన్న ఈ రోజుల్లో కూడా ఆ బ్రహ్మ పదార్థం ఏమిటో తెలుసుకోలేని స్థితే ఉంది. ఎందుకలా.. ?
పూరీ జగన్నాథ క్షేత్రంలో సోమవారం రాత్రి అత్యంత పవిత్రమైన బ్రహ్మపరివర్తన వేడుక జరగనుంది. ఆలయంలోని జగన్నాథుడి మూలవిరాట్టులో ఉండే బ్రహ్మ పదార్థాన్ని.. కొత్తగా రూపొందించిన దారుశిల్పంలోకి మార్చే ఉత్సవమిది. ఆ పదార్థమేమిటో ఎవరికీ తెలియదు. ఎవరూ ఆ పదార్థాన్ని ఇంతదాకా చూడనూలేదు. సాధారణంగా అధిక ఆషాఢమాసం వచ్చిన సంవత్సరంలో పూరీలో కొయ్యతో చేసిన మూలవిగ్రహాలను ఖననం చేసేసి, కొత్తగా ఎంపిక చేసిన చెట్ల దారువుతో మూలవిరాట్టులను తయారుచేసి ప్రతిష్ఠిస్తారు. ఈ వేడుకను నవకళేబర అంటారు.
పాత విగ్రహాలను ఖననంచేసే ముందు.. ఆలయ పూజారి కళ్లకు గంతలు కట్టుకుని, చేతికి వస్త్రం చుట్టుకుని.. జగన్నాథుడి విగ్రహంలో ఉండే బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహంలోకి మారుస్తారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఆ పదార్థం ఏమిటో ఎవ్వరు దానిని తయారు చేశారో..? ఎలా ఉంటుందో కూడా తెలుసుకునే అవకాశం కనీసం పూజారికి కూడా ఉండదు. కేవలం పూజారి దానిని ఒక వస్త్రం ద్వారా దానిని స్పర్శిస్తారే తప్ప తాకను కూడా తాకలేరు. ఇది అత్యంత రహస్యంగా జరగాల్సిన ప్రక్రియ కాబట్టి.. ఇప్పటికే గుడిలోని సీసీటీవీ కెమెరాలన్నింటినీ తొలగించారు. ఆ సమయంలో ఆలయంలోనూ, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు.