లష్కర్ తోయిబా తీవ్రవాద సంస్థలో సన్నిత సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా పౌరుడు డేవిడ్ హెడ్లీ కేసులో బాలీవుడ్ అగ్ర దర్శకుడు మహేష్ భట్ కుమారుడు రాహుల్ భట్ ప్రధాన సాక్ష్యం అని పోలీసు ఉన్నతాధికారులు అన్నారు. దీనిపై ముంబై జాయింట్ కమిషనర్ రాకేష్ మారియా మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో హెడ్లీ కేసులో రాహుల్ భట్ కీలక సాక్ష్యంగా పేర్కొన్నారు.
అయితే, హెడ్లీ వ్యవహారంపై విచారణ కొనసాగుతోందన్నారు. 2006-09 మధ్య కాలంలో హెడ్లీ భారత్‌లో పర్యటించిన సమయంలో రాహుల్ అతనితో కలిసి తిరిగినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ముఖ్యంగా, ముంబైలో తీవ్రవాదులు దాడులు చేసిన ప్రాంతాల్లో రాహుల్, హెడ్లీ కలిసి తిరిగారు.
రాహుల్-హెడ్లీల మధ్య మంచి సంబంధాలు ఉన్నట్టు వెల్లడి కాగా, ఇదే అంశంపై ముంబై పోలీసు ఎదుట రాహుల్ భట్ హాజరై జరిగిందంతా వెల్లడించారు. ఈ నేపథ్యంలో.. హెడ్లీ కేసులో రాహుల్ భట్ ప్రధాన సాక్ష్యం అని ముంబై పోలీసులు చెప్పడం గమనార్హం.