జాతీయ వారసత్వ జంతువుగా గజరాజును ఎంపిక చేశారు. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ శుక్రవారం ప్రకటన చేసింది. అలాగే, అంతరించి పోతున్న ఏనుగుల మందను రక్షించేందుకు కూడా కొన్ని సూచనలు, సలహాలను జారీ చేసింది. అంతరించి పోతున్న గజరాజుల పరిరక్షణకు కేంద్రం ఏర్పాటు చేసిన 12 మంది సభ్యులతో కూడిన కమిటీ చేసిన ప్రతిపాదనలకు ఈనెల 13వ తేదీన జరిగిన నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్ స్టాండింగ్ కమిటీ ఆమోదముద్ర వేసింది.
ఈ అంశంపై కేంద్ర పర్యావరణ శాఖామంత్రి జైరామ్ రమేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని తరాలుగా వస్తున్న మన సంస్కృతిలో గజరాజులు ఒక భాగమన్నారు. అందువల్ల పులులను సంరక్షించినట్టుగానే వీటిని కూడా రక్షించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
అంతేకాకుండా, నేషనల్ ఎలిఫెంట్ కన్జర్వేషన్ అథారిటీకి చెందిన 12 మంది సభ్యుల కమిటీ కూడా ఏనుగుల రక్షణ, గుర్తింపుపై ఒక నివేదిక సమర్పించింది. ఇదిలావుండగా, ఆసియా ఖండంలో ఉన్న గజరాజుల్లో 60 శాతం ఏనుగులు భారత్‌లో ఉన్నాయి. ఒక్క మన దేశంలోనే 25000 ఏనుగులు ఉండగా, వీటిలో 3500 ఏనుగులు బంధీలుగా ఉన్నట్టు మంత్రి పేర్కొన్నారు.