మైనర్ బాలిక సమ్మతితో సంబంధం పెట్టుకున్నా సరే దానిని మహిళపై జరిగిన అత్యాచారంగానే లెక్కించాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తన ప్రియుడితో లేదా భాగస్వామితో ప్రేమతో ఇష్టపూర్వకంగానే ఆమె శారీరక సంబంధంలోకి పోయినప్పటికీ ఈ ఉదంతాన్ని తేలిగ్గా తీసుకోరాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు అరుదైన వ్యాఖ్యానానికి కారణమైన కేసు వివరాలలోకి వెళితే... పంజాబ్ రాష్ట్రానికి చెందిన కుమార్ 16 ఏళ్ల వయసున్న బాలికతో సంబంధం పెట్టుకున్నాడు. ఆమె తలిదండ్రులు మరోవైపున తమ కూతురును అపహరించి, అత్యాచారం చేశాడని కుమార్‌పై ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం పంజాబ్ సెషన్స్ కోర్టు నిందితుడైన కుమార్‌కు ఏడే్ళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.అత్యాచారం చేసి సాకులు చెబితే... |
|
మహిళ సమ్మతితోటే సంబంధంలోకి పోయామని, కులట కాబట్టి అత్యాచారం చేశామని నిందితులు చేస్తున్న వాదనలకు అనుకూలంగా లాయర్లువాదిస్తున్న కాలాన్ని మనం చూశాం. కాని ఇప్పుడు మహిళ హక్కులను పరిరక్షించేలా సుప్రీం వ్యాఖ్యానిస్తూండటం నిజంగా హర్షణీయం..... |
|
|
అయితే బాధితురాలు, నిందితుడు ఇద్దరూ ప్రేమికులే అయినందున శిక్షాకాలాన్ని ఏడునుంచి మూడేళ్లకు తగ్గిస్తూ పంజాబ్-హర్యానా హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ పంజాబ్ ప్రభుత్వం సుప్రీకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన ధర్మాసనం మైనర్ బాలికతో ప్రణయాన్ని సైతం అత్యాచారంగానే పరిగణించాలని వ్యాఖ్యానించింది.
అయితే తమ కుమార్తెకు మరొకరితో వివాహమైనందున నిందితుడికి క్షమాబిక్ష పెట్టాలని బాధితురాలి తండ్రి అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో పునరాలోచించిన సర్వోన్నత న్యాయస్థానం నిందితుడికి విధించిన ఏడేళ్ల కఠిన కారాగార శిక్షను మూడేళ్లకు తగ్గిస్తూ తీర్పు చెప్పింది.
మహిళ సమ్మతితోటే సంబంధంలోకి పోయామని, ఆమె కులట కాబట్టి అత్యాచారం చేశామని నిందితులు చెబుతున్న విషయాలనే ప్రధానంగా తీసుకుని వారికి అనుకూలంగా లాయర్లు, కోర్టులు వాదిస్తున్న కాలాన్ని మనం చూశాం. కాని ఇప్పుడు మహిళ హక్కులను, గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని స్వంతం చేసుకుంటూ సుప్రీం కోర్టు అరుదైన తీర్పులను చెబుతుండటం నిజంగా హర్షించవలసిన విషయం.
కోర్టు తీర్పు ఇచ్చేసింది కాబట్టి ఇకపై ఇలాంటి నేరాలు, ఘటనలు జరగవని ఎవరూ భ్రమలు పెట్టుకోవద్దు గానీ, నిజంగా అఘాయిత్యం పాలబడిన క్షణాల్లో, బాధితురాలికి విచారణ సమయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలు కొండంత అండగా ఉంటాయనడంలో సందేహం లేదు మరి. అందుకే ఇలాంటి అరుదైన వ్యాఖ్యానాలను మనమూ సమర్థించుదామా...