Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హోలికా పూర్ణిమ... నడిచొస్తోంది మీ సౌందర్యవతి

హోలికా పూర్ణిమ... నడిచొస్తోంది మీ సౌందర్యవతి

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

WD
సంవత్సరంలో చిట్ట చివరన వచ్చే పూర్ణమ ఈ హోళికా పూర్ణిమ. లోకంలో ఎవరికైనా చిట్ట చివరి సంతానం అంటే చెప్పలేనంత ఇష్టం. అలాగే ఏడాదిలో చివరిగా వచ్చే ఈ హోళికా పూర్ణిమ కూడాను. అందుకే పెద్దలు ఈ హోళికా పూర్ణిమను ఓ ఉత్సవంలా జరుపుకోవాలని నిర్ణయించారు. ఏడాది పొడవునా సుఖదుఃఖాల సమ్మిళతంగా సాగిపోయిన కాలానికి స్వస్తి చెపుతూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఆనంద సాగరంలో మునిగిపోతారు.

ఆ రోజన హోళీ జరుపుకున్న ప్రతి ఒక్కరు రంగులతో తడిసి నూతన సౌందర్యాన్ని తెచ్చుకుంటారు. నగలూ-నట్రా మంచి దుస్తులు వేసుకుంటేనే సౌందర్యంగా కనబడతారని చాలామంది అనుకుంటారు. కానీ మహాకవి పింగళి సూరన కళాపూర్ణోదయమనే కావ్యంలో అసలైన సౌందర్యం ఎక్కడుందో చెప్పాడు.

పూర్వం శాలీనుడనే పేరుగల నాయకుడుండేవాడు. అతనికి చక్కని శరీరము, సౌందర్యవతి అయిన సుగాత్రితో వివాహమైంది. వివాహమయ్యాక ఆమెను అతనితో పొందుకోసం మొదటిరాత్రి లోనికి పంపారు. ఆ రోజు రాత్రి ఏ మల్లెలూ వాడిపోలేదు. ఏ దుస్తులు నలగలేదు. అసలు ఆమెలో కించిత్ మార్పు సైతం కానరాలేదు.

ఒకటి.. రెండు.. మూడు రాత్రులు ఇదే రీతిలో గడిచిపోయాయి. రాత్రి వేళ ఆమె గదిలోకి వెళ్లడం... ఉదయాన ఎలా వెళ్లిందో అలానే తిరిగి రావడం జరిగింది. దాంతో ఆమె మానసికంగా కుంగి పోయింది. తన సౌందర్యాన్ని చూసి భర్తలో చలనం లేకపోవడంపై మధనపడింది.

ఈ పరిణామాలను గమనించిన బంధువులు పరిపరి విధాల ఆలోచించారు. ఇక ఆమె తల్లిదండ్రుల పరిస్థితి వర్ణనాతీతం. సంగతేమిటని అతణ్ణి అడిగేందుకు ఎవరూ సాహసించలేదు. భార్య సుగాత్రికి సైతం భర్త ఏమీ చెప్పలేదు. కానీ ఆమె మాత్రం గదిలోకి వెళ్లడం మానుకోనూ లేదు. ఇలా కాలం గడిచిపోతోంది.

ఒకరోజున అతను తన ఇంటి పెరటి చెట్లకు పాదులు చేస్తున్నాడు. భర్త పాదులు చేయడాన్ని చూసి తను పాదులకు నీరు పోసేందుకు సిద్ధమైంది. పని చేసేది తోటలో కదా.. అని ఆమె తన ఆభరణాలను తీసేసి భర్తను ఆకర్షించాలనే ధోరణితో కాక కేవలం సహజ సౌందర్యంతో చక్కగా ఒంపు సొంపులతో చెట్లకు నీళ్లు పోయడం ఆరంభించింది. ఒకానొక సందర్భంలో అతడు భార్య నీళ్లు పోయడాన్ని గమనించాడు. చిత్రం.. ఆమె అద్భుత సౌందర్యరాశిగా అతనికి తోచింది.

ఒక్క ఉదుటున భార్య దగ్గరకు వెళ్లాడు. ఆమే భుజం మీద చేయి వేశాడు. కలిసి నడిపించాడు. శరీరాల్లో విద్యుత్తు ప్రవహించింది. కాలానికే సిగ్గేసింది. కథ సుఖాంతమైంది. తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన అటకెక్కింది.

ఎందుకిలా జరిగిందీ అంటే... అప్పటి వరకూ ఆమె సకలాభరణాలతో తన సహజ సౌందర్యాన్ని దాచేసింది. నేడు తోట పనిలో సౌందర్యాన్ని భర్త చూసి వివశుడైనాడు. ఆమె జీవితంలో వేయి పున్నములు విరిసాయి.

ఇలాంటి సహజ సౌందర్యం ప్రకృతిలో కనిపించేంది ఖచ్చితందా ఈ శిశిర ఋతువులోనే. ఈ ఫల్గుణ మాసంలోని పూర్ణిమనాడు వికసించే చంద్ర కాంతికి స్త్రీ పురుషుల మనస్సు ఆకాశం నుంచి విరబూసే వెండివెన్నెలలో విహరించాలని తహతహ లాడుతుంది. అందుకే మన పెద్దలు ఈ హోలికా పూర్ణిమను ఫల్గుణ పూర్ణిమనాడు ఏర్పాటు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu