Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విఘ్నేశ్వర వ్రత కథ

విఘ్నేశ్వర వ్రత కథ
, శుక్రవారం, 14 సెప్టెంబరు 2007 (13:44 IST)
WD PhotoWD
శౌనికాదిమునులకు విఘ్నేశ్వరుని జన్మ వృత్తాంతము, చంద్రుని చూచినచో కలిగే దోషం మరియు దోష నివారణను సూతమహాముని చెప్పడం మొదలు పెట్టాడు. పూర్వం ఏనుగు రూపంలోని ఒక రాక్షసుడు పరమశివునికై ఘోరంగా తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి ప్రసన్నడైన శివుడు రాక్షసుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. శివుని చూసి పరమానందభరితుడైన ఆ రాక్షసుడు భక్త సులభా నీవు ఎల్లప్పుడూ నా కడుపులో ఉండే వరాన్ని ప్రసాదించమని కోరాడు.

శివుడు తథాస్తు అన్నాడు. ఈ సంగతి తెలియని పార్వతి, భర్త జాడ తెలియక మహావిష్ణువుకు మొరపెట్టుకుంది. పార్వతి వేదనను తీర్చుటకై గజాసురుని కడుపులోని శివునికి విముక్తి కలిగించేందుకు నందిని గంగిరెద్దుగా అలంకరించి దేవతలతో పాటు తాను కూడా గంగిరెద్దులాడించే వారి వేషములో బయలుదేరి గజాసురపురంలో ఆడసాగారు. తన భవనములో ఆడవలసిందిగా గజాసురుడు కోర్కెను మన్నించి మారువేషములోని తమ ఆటపాటలతో గజాసురుని రంజింపచేసారు.

వారి ఆటపాటలకు సంతృప్తి చెందిన గజాసురుడు ఏదైనా వరము కోరుకొనమని వారిని అడిగాడు. గంగిరెద్దు రూపంలోని నంది తన యజమాని అయిన పరమశివుని వెదుకుతూ ఇక్కడకు వచ్చిందని, మీ కడుపులోని శివుని ఇప్పించమని శ్రీమహావిష్ణువు కోరాడు. దీంతో నివ్వెరపోయిన గజాసురుడు అంగీకరించడంతో, తన వాడి అయిన కొమ్ములతో నంది, గజాసురుని కడుపుని చీల్చడంతో వెలుపలికి వచ్చిన పరమశివుడు మహావిష్ణువునికి స్తోత్రాలతో స్తుతించాడు.

గజాసురుని కోరిక మేరకు అతని తలను సర్వ లోకాలు పూజించేందుకు, అతని చర్మాన్ని తాను ధరించేందుకు మహాశివుడు స్వీకరించాడు. దేవతలందరూ ఎవరి గృహాలకు వారు వెళ్ళగా నందిని అధిరోహించిన శివుడు కైలాసం దారి పట్టాడు. విఘ్నేశ్వరుని జననం శివుని రాకను తెలుసుకొని సంతోషించిన పార్వతి స్నానం చేసే సమయంలో నలుగు పిండితో ఒక పిల్లవాడిని సింహద్వారం వద్ద కాపలా ఉంచింది. అనంతరం స్నానం పూర్తి చేసిన పార్వతి అన్ని రకాల ఆభరణాలను, మేలైన వస్త్రాలను ధరించి భర్త రాకకై వేచి చూడసాగింది.

నందితో సహా సింహద్వారం దాటబోయిన శివుని నలుగు పిండి పిల్లవాడు అడ్డగించాడు. దీంతో పరమేశ్వరునికి పట్టరాని కోపం వచ్చి తన త్రిశూలంతో ఆ పిల్లవాడి కంఠమును ఛేదించి లోపలకు వెళ్ళాడు. లోపలికి వచ్చిన భర్తతో ఆనందంగా మాట్లాడుతున్న పార్వతి, మాటల మధ్యలో పిల్లవాని కంఠము ఛేదించిన సంగతిని తెలుసుకుని బాధపడుతుంది. పార్వతి బాధకు చింతించిన శివుడు, తాను తీసుకువచ్చిన గజాసురుని తలను ఆ పిల్లవానికి అతికించి, ప్రాణం పోసి "గజాననుడు" అని పేరు పెట్టాడు.

వారిరువురి ప్రేమాభిమానాలతో పెరుగుతూ, తల్లిదండ్రులను సేవిస్తూ, తిరగడం కోసం అనింద్యుడనే ఎలుకను వాహనంగా చేసుకున్నాడు గజాననుడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. మహాబలవంతుడైన అతడు నెమలిని వాహనంగా చేసుకుని దేవతల సేనకు నాయకుడైన పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. విఘ్నాధిపతిగా మారిన వైనం తాము చేసే కార్యాలకు ఆటంకాలు కలుగకుండా ఒక అధిపతిని నియమించవలసిందిగా దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని ప్రార్ధించారు.

webdunia
WD PhotoWD
పెద్దవాడిని కాబట్టి నాకు ఆ పదవిని ఇవ్వాలని గజాననుడు, కాదు కాదు నేనే పదవిని చేపడతానని కుమారస్వామి పోటీపడతారు. మీరిద్దరిలో ఎవరు మూడు లోకాలలో తిరగడంతో పాటు ఆయా లోకాలలోని పుణ్య తీర్థాలలో స్నానం చేసి వస్తారో వారికి విఘ్నాధిపతి పదవిని ఇస్తానని పరమశివుడు పరీక్ష పెడతాడు. వెంటనే నెమలిని అధిరోహించిన కుమారస్వామి విజయానికై బయలుదేరుతాడు. తండ్రి పరీక్షను విని నివ్వెరపోయిన గజాననుడు, నేను శక్తిలేనివాడనని తెలిసి కూడా ఇలాంటి పరీక్షను పెట్టటం భావ్యమా అని తల్లిదండ్రులకు మొరపెట్టుకుంటాడు.

గజానుని పరిస్థితిని అర్థం చేసుకున్న శివుడు, అతనికి నారాయణ మంత్రమును ఉపదేశించడంతో, మంత్రమును మనఃపూర్వకముగా జపించిన గజాననుడు కైలాసంలో కదలకుండా కూర్చుంటాడు. ఇక విజయం సాధించడానికి బయలుదేరిన కుమారస్వామి ఎక్కడకు వెళ్ళినా సరే అక్కడ గజాననుడు కనపడుతున్నాడు. అన్నగారి గొప్పదనాన్ని తెలుసుకున్న కుమారస్వామి తన అపచారమును మన్నించవలసిందిగా పరమశివుని ప్రార్థిస్తాడు. విజయుడైన గజానుని భాద్రపద శుద్ధ చవితినాడు మహేశ్వరుడు విఘ్నాధిపతిగా నియమిస్తాడు.

ఆ రోజున యావత్‌ప్రపంచం విఘ్నేశ్వరుని భక్తితో పూజించి, కుడుములు తదితర పిండివంటలు, టెంకాయలు, తేనె, పాలు, అరటిపండ్లు, పానకం, వడపప్పు నైవేద్యంగా సమర్పించింది. సంతృప్తితో విఘ్నేశ్వరుడు వాటిని భుజించి, భుక్తాసయముతో కిందకు వంగలేని వాడై తల్లిదండ్రులకు పాద నమస్కారం చేసుకుందామని ప్రయత్నిస్తున్న తీరును చూసిన శివుని తలలోని చంద్రుడు వికటాట్టహాసం చేస్తాడు. దిష్టి ప్రభావంతో గజానుని కడుపు విచ్ఛిన్నమై కుడుములన్నీ కింద పడతాయి. దాంతో అతడు మరణిస్తాడు. కుమారుని మరణాన్ని చూసిన పార్వతి చంద్రుని వంక చూసి తీవ్రమైన స్వరంతో "పాపాత్ముడా! నీ దిష్టి తగిలి నా కుమారుడు మరణించాడు. కనుక ఇకపై నిన్ను చూసినవారు పాపాత్ములై నిందలను ఎదుర్కుంటారు" అని శపించింది.

నిందల పాలైన మహర్షుల భార్యల
అదేసమయంలో యజ్ఞం చేస్తున్న సప్త మహర్షుల భార్యలు అగ్నికి ప్రదక్షిణ చేస్తున్నారు. వారిని చూసి మోహించిన అగ్ని, భయముతో క్షీణించసాగాడు. అది గమనించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి, తానే మహర్షుల భార్యల రూపాన్ని పొంది భర్తకు సేవ చేయసాగింది. స్వాహాదేవి వైనాన్ని గుర్తించని మహర్షులు, అగ్నికి సేవ చేస్తున్నది తమ భార్యలేనని తలచి, వారిని వదిలివేస్తారు. పార్వతి శాపం పెట్టిన తరువాత చంద్రుని చూడటం వలన వారు నిందల పాలయ్యారు.

మునులు, దేవతలు, మహర్షుల భార్యల ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ, సప్తమహర్షలకు వాస్తవం తెలిపి, వారికి నచ్చచెప్పడంతో వారు భార్యలను స్వీకరిస్తారు. అటు తరువాత కైలాసానికి వెళ్ళిన బ్రహ్మ విఘ్నేశ్వరుని బతికిస్తాడు. "నీ శాప ప్రభావంతో లోకాల్లన్నింటికి ముప్పు వాటిల్లింది. శాపము ఉపసంహరించుకో పార్వతి దేవీ!" అని దేవతలు ప్రార్ధించడంతో " ఏ రోజు నా కుమారుని చూసి చంద్రుడు నవ్వాడో, ఆ రోజు చంద్రుని చూడరాదు " అని తెలిపింది పార్వతి. సంతోషించిన బ్రహ్మ తదితర దేవతలు, భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూడకుండా సుఖంగా ఉండసాగారు.

webdunia
WD PhotoWD
శ్రీకృష్ణుని నిందల పాలు చేసిన శమంతకమణి
ద్వాపర యుగంలో ద్వారకకు చేరుకుని శ్రీకృష్ణునితో మాట్లాడుతున్న నారదుడు " స్వామీ! సాయంత్రమైంది. పైగా ఈ రోజు విఘ్నేశ్వర చతుర్ధి. చంద్రుని చూడకూడదని పార్వతి శాపమిచ్చింది. కనుక ఇంటికి వెళతాను సెలవిప్పించండి" అని శాపము వెనుక సంగతిని శ్రీకృష్ణునికి వివరించాడు. ఆరోజు రాత్రి ఎవరూ చంద్రుని చూడకూడదని ద్వారకలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు. పాలంటే ఇష్టపడే శ్రీకృష్ణుడు ఆ రాత్రి పాలు తాగుదామని గోవుల దగ్గరుకు వెళ్ళి, పాలలో చందమామ నీడను చూస్తాడు.

"ఆహా! నేను ఎటువంటి నిందల పాల పడతానో కదా" అని అనుకుంటాడు. కొంతకాలానికి శ్రీకృష్ణుని ఇంటికి అతిథిగా వచ్చిన సత్రాజిత్తు, సూర్యుడు తనకు వరంగా ఇచ్చిన శ్యమంతక మణిని శ్రీకృష్ణునికి చూపిస్తాడు. మణిని చూసి ముచ్చట పడిన శ్రీకృష్ణుడు మణిని తనకు ఇవ్వవలసిందిగా కోరుతాడు. రోజుకు ఎనిమిది బారువులను ఇచ్చే ఈ మణిని ఎంతటి సన్నిహితులకైనా ఇచ్చే ప్రసక్తి లేదని సత్రాజిత్తు స్పష్టంగా చెపుతాడు. ఇదిలా ఉండగా సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు ఒక రోజు శ్యమంతక మణిని మెడలో ధరించి వేటకని అడవికి పోతాడు.

ప్రసేనుని మెడలోని మణిని మాంసపు ముక్కగా భావించిన ఒక సింహం, ప్రసేనుని చంపి మణిని ఎత్తుకుపోతుంది. దారిలో సింహానికి ఎదురుపడిన ఒక ఎలుగుబంటి దానిని చంపి, మణిని తీసుకుపోయి తన కొండగుహలో ఉయ్యాలలో పడుకొని ఉన్న తన కుమార్తె జాంబవతికి ఆటవస్తువుగా ఇచ్చెను. మణిని ఇవ్వలేదనే కారణంగా శ్రీకృష్ణుడు నా తమ్ముడిని చంపి మణిని దొంగలించుకపోయాడని సత్రాజిత్తు ప్రకటించాడు. చందమామ నీడ తాలూకూ ప్రభావమని భావించిన శ్రీకృష్ణుడు, అడవిలోకి వెళ్ళి ప్రసేనుని మృతదేహాన్ని కనుగొంటాడు.

సింహం కాలి గుర్తుల ఆధారంగా, ఎలుగుబంటి కాలి గుర్తుల ఆధారంగా కొండగుహకు చేరుకున్న కృష్ణుడు, ఉయ్యాలలో ని జాంబవతి చేతిలోని మణిని తీసుకుని
webdunia
WD PhotoWD
వెనుదిరుగుతుండగా, జాంబవతి ఏడుపు మొదలుపెట్టింది. కూతురు ఏడుపు విని అక్కడకు చేరుకున్న జాంబవంతుడు, శ్రీకృష్ణునితో రాత్రింబవళ్ళు ఎడతెరిపి లేకుండా 28 రోజులు పోరాడుతాడు. శ్రీకృష్ణుని జయించడం తనవల్లకాదని తెలుసుకున్న జాంబవంతుడు, శ్రీకృష్ణునిలో శ్రీరామచంద్రుని చూస్తాడు. త్రేతాయుగమున ఏదైనా వరము కోరుకోమ్మని శ్రీరాముడు అడిగినప్పుడు, తెలివితక్కువగా మీతో ద్వంద్వ యుద్ధము చేయాలని కోరుకొనగా, శ్రీరాముడు వరమొసగిన వైనాన్ని జాంబవంతుడు శ్రీకృష్ణునికి విన్నవించుకుంటాడు.

తన వరాన్ని ఈ రూపంలో తీర్చినందుకు శ్రీకృష్ణుని స్తుతిస్తాడు. తనపై వచ్చిన నిందను దూరం చేసుకోవడం కోసమే మణిని వెదుక్కుంటూ వచ్చానని శ్రీకృష్ణుడు, జాంబవంతునితో చెప్పిందే తడవుగా, మణితో పాటు తన కుమార్తె జాంబవతిని కానుకగా ఇస్తాడు జాంబవంతుడు. ద్వారక చేరుకున్న శ్రీకృష్ణుడు జరిగిన సంగతిని ప్రజలందరికి తెలిపి, మణిని సత్రాజిత్తుకు అందచేస్తాడు. సత్రాజిత్తు తన కుమార్తె సత్యభామను కానుకాగా ఇస్తాడు. ఒక మంచి ముహూర్తంలో జాంబవతిని, సత్యభామను శ్రీకృష్ణుడు వివాహం చేసుకొనెను.

పెళ్ళికి వచ్చిన దేవతలు, మునులు శ్రీకృష్ణుని స్తుతించి " మీరు సమర్ధులు కాబట్టి నిందను తొలగించుకున్నారు. మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి" అని వేడుకొన్నారు. వారి మొరను ఆలకించిన శ్రీకృష్ణుడు ప్రసన్నుడై " భాద్రపద శుద్ధ చవితినాడు పొరపాటున చంద్రుని చూసిన వారు, ఆ రోజు గణపతిని పూజించిన అనంతరం ఈ శ్యమంతకమణి కథను విని అక్షింతలు తలపై వేసుకునేవారికి ఎటువంటి నిందలు రావు" అని వరము ఇవ్వడంతో దేవతలు, మునులు సంతసించి శ్రీకృష్ణుడు తెలిపిన విధంగా ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితినాడు గణపతి పూజను చేసి సుఖముగా ఉండసాగారని శౌనకాది మునులకు తెలిపిన సూతమహాముని తన ఆశ్రమానికి వెడలిపోయాడు.

Share this Story:

Follow Webdunia telugu