Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాడవీధులలో మారుతిపై ఊరేగిన శ్రీవారు

మాడవీధులలో మారుతిపై ఊరేగిన శ్రీవారు
జగదాభిరాముడు కౌసల్య తనయుడు ఆజానుబాహువు, అరవింద దళాక్షుడైన ముగ్దమనోహర నీలవర్ణ శోభితుడు, అయోధ్య రాముని నామస్మరణయే శ్వాసగా భావించి భక్తులకు ఆదర్శనీయుడుగా నిలిచిన ఆంజనేయుని వాహనంగా చేసుకుని తిరుమలలోని మాడవీధులలో గురువారం ఉదయం రెండుగంటల పాటు శ్రీవారు సాగించిన సంచారం తిరుమలేశుని భక్తులకు అత్యంత రమణీయంగా నిలిచిపోయింది.

దేవాది దేవులు, మహర్షులు, యక్ష,కిన్నెర,కింపురుషులు వెంటరాగా ఆంజనేయుడు గంతులు వేస్తూ తీసుకు వెళుతున్నాడా... అన్న రీతిలో నీటి అలలపై తేలుతున్న పడవవోలె సాగుతున్న తిరుమలేశుని ఊరేగింపును వీక్షించేందుకు భక్తులు బారికేడ్ల ఆవల నిలుచుండి తదేక దీక్షతో గోవింద నామస్మరణ గావిస్తూ తిరుమలేశునికి తమ హృదయాన్ని నైవేద్యంగా సమర్పించుకుంటున్న దృశ్యం అంచంచల భక్తి విశ్వాసాలకు తార్కాణంగా నిలుస్తుంది.

పవిత్రతను పాదుగొలిపే మంగళవాయిద్యాల సుమధుర నాదాలు, బృందాలుగా చేరిన భక్తజనులు చేసే భజనలు, తాళాలు, తపెట్లతో, బాజాభజంత్రీలతో తిరుమల నగరి ఆధ్యాత్మిక భావనలకు కూడలిగా నిలిచింది. ఈ రోజు సాయంత్రం 5.00 గంటల నుంచి 6.00 గంటలవరకు స్వర్ణరథోత్సవం జరుగనుంది. రాత్రి 9.00 గంటల నుంచి 11 గంటలవరకు గజవాహన సేవలు జరుగనున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu