Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"ఎన్ఆర్ఐ ఓటింగ్ రైట్స్ డ్రైవ్" విజయవంతం

Advertiesment
ఎన్ఆర్ఐ ఓటింగ్ హక్కులు
WD
ఎన్ఆర్ఐ ఓటింగ్ హక్కుల కోసం అక్టోబర్ 31, 2010 తేదీన శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలో నిర్వహించిన "ఎన్ఆర్ఐ ఓటింగ్ రైట్స్ డ్రైవ్" విజయవంతమై పండుగ వాతావరణాన్ని తలపించింది. విదేశాలలో ఉంటున్న భారతీయలు పరోక్ష పద్ధతిలో భారత్‌లో జరిగే ఎన్నికలలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని డిమాండు చేస్తూ.. ఎన్ఆర్ఐ ఓటింగ్ హక్కుల ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమలో పెద్ద సంఖ్యలో ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మొత్తాన్ని పీపుల్స్ ఫర్ లోక్‌సత్తా, మానవతా డాట్ ఆర్గ్, ఇండియన్ కమ్యూనిటీ సెంటర్‌లు సంయుక్తంగా నిర్వహిచారు. ఈ ర్యాలీలో ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి అథిదిగా వచ్చిన శరత్ మంగలంపల్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారతదేశ ఆర్థికాభివృద్ధి, సాంకేతిక రంగం వంటి పలు కీలక రంగాలలో ప్రవాస భారతీయులు తమవంతు కృషి చేస్తున్నారని శరత్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశ అబివృద్ధిలో ప్రవాస భారతీయులకు కీలక పాత్ర కల్పించాల్సింది పోయి.. భారత్‌లో ఓటు వేసే ప్రాధమిక హక్కును ప్రభుత్వం తొలగించడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.

నవంబర్ 2010లో జరగనున్న పార్లమెటు శీతాకాల సమావేశాలలో పార్లమెంటు దిగువసభలో ఎన్ఆర్ఐ ఓటింగ్ హక్కుల బిల్లును ప్రవేశపెడతారని, కానీ.. ఈ బిల్లు ప్రకారం భారత్‌లో జరిగే ఎన్నికలలో ఓటు వేయాలనుకునే ఎన్ఆర్ఐలు ప్రత్యక్షంగా(భౌతికంగా) హాజరై తమ ఓటును వినియోగించుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు. అయితే ఆచరణ పరంగా ఇది అసాధ్యమైనదని, అందుకు కావల్సిన అమెండ్‌మెంట్ (మార్పులను)ను ఈ బిల్లులో చేస్తేనే అది అర్థవంతమౌతుందని ఆయన వివరించారు. ఇంకా.. ఎన్ఆర్ఐలకు పరోక్ష ఓటింగ్ సదుపాయాన్ని కల్పించేలా ఈ బిల్లును సవరించాలని ఆయన అన్నారు. ఇంటర్నెట్, పోస్టల్ బ్యాలెట్‌ ద్వారా పరోక్షంగా ఎలా ఓటింగ్ చేయవచ్చనే అంశాన్ని ఆయన వివరించారు.

ప్రముఖ ఎంటర్ ప్రెన్యూర్, సిలికాన్ వ్యాలీ కమ్యూనిటీ లీడర్ నరేన్ భక్షి ముఖ్య అతిథిగా హాజరై చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. గత నాలుగు దశాబ్దాలకు పైగా తాను అమెరికా, భారత అస్తిత్వాలతో జీవిస్తున్నానని ఆయన చెప్పారు. ఎన్ఆర్ఐ ఓటింగ్ హక్కుల కోసం జరుగుతున్న ప్రచార కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని, పరోక్ష పన్నుల కోసం రూపొందించిన పిటిషన్‌పై సంతకాలు సేకరించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయల మద్దతును మీడియా సహాయంతో పొందాలని ఆయన కోరారు.

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనకు బ్లూప్రింట్ తయారు చేసిన జట్టులో ఉన్న భక్షి విద్య, ఇ-గవర్నెన్స్, ప్రత్యామ్నాయ ఇంధన పరిశోధన రంగాల్లో భారత - అమెరికా సంయుక్త భాగస్వామ్యానికి గల అవకాశాలను వివరించారు. అదే సమయంలో ప్రతి ఒక్కరు నిజమైన భారతీయుడిగా, నిజమైన అమెరికన్‌గా ఉండడానికి వీలుందని చెప్పారు. ఈ ఎన్ఆర్ఐ ఓటింగ్ బిల్లుపై భారత ప్రభుత్వంతో పోరాడడానికన్నా విస్తృతమైన చర్చలో పాలు పంచుకొని శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఈ పరోక్ష ఓటింగ్ పద్ధతి ప్రతి భారతీయునికి ఉపయోగకరమైనదని, ప్రస్తుతం భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తులు భవిష్యత్తులో విదేశాలకు వెల్లాల్సి వచ్చినా కూడా వారికి ఉపయోగకరంగా ఉంటుందని ఆయన చెప్పారు.

పరోక్ష ఓటింగ్ పద్ధతిని కొందరు భారత రాజకీయ నాయకులు వ్యతిరేకిస్తున్నారని, ఎందుకంటే ఎన్ఆర్ఐల ఓట్లు అవినీతి రాజకీయ మార్గాలైన మద్యం, డబ్బు పంపణీ వంటి వాటికి ప్రభావితం కావు. ఇటువంటి అవినీతి రాజకీయాలు ఎన్ఆర్ఐ ఓట్లపై ప్రభావం చూపలేవు అందువల్లే వారు ఈ పరోక్ష ఓటింగ్ పద్ధతిని వ్యతిరేకిస్తున్నారని ఎకానామిక్స్, డెవలెప్‌మెంట్ సబ్జెక్ట్స్ బ్లాగర్ అతాను దేయ్ అన్నారు. అదృష్టవశాత్తు తాను భారత పౌరసత్వాన్ని కాపాడుకోగలిగానని బే ఏరియాలో జర్నలిస్టుగా పనిచేస్తున్న అనిత అన్నారు. ఎన్ఆర్ఐలకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని భారత ప్రభుత్వం కల్పిస్తే ఎన్ఆర్ఐలు భారత్ వెళ్లడానికి 1500 డాలర్లు ఖర్చు చేయడానికి బదులు పోస్టల్ బ్యాలెట్‌కు 5 డాలర్లు ఖర్చు చేస్తే సరిపోతుందని ఆమె అన్నారు. తానా అధ్యక్షుడు జయరామ్ కోమటి వంటి ఇతర నగరాలకు చెందిన వివిధ కమ్యూనుటీల నేతలు ఈ ర్యాలీని బలపరిచారు.
webdunia
WD


బే ఏరియా పీపుల్స్ ఫర్ లోక్‌సత్తా వాలంటీర్ శ్రీకాంత్ కొచ్చర్లకోట తన క్యాంపైన్ అనుభవాలను పంచుకున్నారు. ఎన్ఆర్ఐ పరోక్ష ఓటింగ్ హక్కుల కోసం పీపుల్స్ ఫర్ లోక్‌సత్తా ప్రపంచవ్యాప్తంగా ప్రచారాన్ని చేపట్టిందని, ఇటీవల నిర్వహించిన "ఎంపీలకు పిలుపు" (కాలింగ్ ఫర్ ఎంపీ'స్) అనే ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిన శ్రీకాంత్.. కర్ణాటక పార్లమెంటు సభ్యులకు నుంచి వచ్చిన అనూహ్య స్పందనుకు, ఎన్ఆర్ఐ ఓటింగ్ హక్కుపై వారికి గల అవగాహనకు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కర్ణాటక చిత్రదుర్గానికి చెందిన బిజెపి నేత జనార్థన్ స్వామి కూడా పరోక్ష ఓటింగ్ పద్ధతికి మద్దతు ఇవ్వడంతో పాటు.. విలువైన సలహాలు ఇచ్చారని శ్రీకాంత్ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu