కాలిఫోర్నియా సిలికానాంధ్ర ఆధ్వర్యంలో.. విరోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు స్థానిక సన్నివేల్ హిందూ దేవాలయంలో ఘనంగా జరిగాయి. ప్రవాసాంధ్రులు ఉదయాన్నే ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేయడంతో పాటు అందరూ ఉగాది పచ్చడిని తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల్ని, పెద్దల్ని అలరించాయి.
అలాగే... గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో.. వర్జీనియాలోని జార్జి మార్షల్ హైస్కూలులో ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. స్థానికంగా ఉండే ప్రవాసాంధ్రులు అధిక సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొనగా.. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భరతనాట్యం, కూచిపూడి, జానపద నృత్యాలు అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి.
కెనడాలోని తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టొరంటో వారి ఆధ్వర్యంలో విరోధి నామ సంవత్సర వేడుకలను స్థానిక టెసిల్టన్ కాలేజీ ఆడిటోరియంలో కన్నులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య కీర్తనలు, భక్తిగీతాలు, జానపద నృత్యాలు తదితర కార్యక్రమాలు ప్రవాసాంధ్రులను మైమరపించాయి.