మీరు వర్కింగ్ పారెంట్సా.. అయితే పిల్లల పెంపకంపై అధిక శ్రద్ధ అవసరమని వైద్యులు అంటున్నారు. పిల్లలను క్రీచ్‌ల్లో, పనిమనిషుల వద్ద వదిలిపెట్టి ఉద్యోగాలకు వె తల్లిదండ్రులు.. పిల్లల బాగోగుల పట్ల అప్పుడప్పుడు సమాచారం తీసుకుంటూవుండాలి. ఆధునిక యుగంలో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. లైఫ్ స్టైల్‌కు అనుగుణంగా పాపాయిలను తక్కువ నెలల్లోనే వదిలిపెట్టి ఉద్యోగాలకు వెళ్లిపోతున్నారు.
ఇలాంటి వారు కొన్ని టిప్స్ పాటిస్తే మీ పాపాయి మీకు దూరంగా ఉందనే భావాన్ని తగ్గించుకోవచ్చు. ఉద్యోగాలకు వెళ్ళినా బాధ్యతాయుతంగా మీ పాపాయిని చూసుకునేవారైతే పర్లేదు. బయటి మనుషులైతే మాత్రం రెండు గంటలకు ఓసారి పాపాయి బాగోగులను అడిగి తెలుసుకుంటూ వుండాలి.
పిల్లలకు బాగోలేనప్పుడు ఆ రోజు లీవు తీసుకోవడం చేయాలి. అలాంటి సమయాల్లో అధిక సమయం పిల్లలతో గడిపేలా తల్లిదండ్రులు ప్లాన్ చేసుకోవాలి. వర్కింగ్ పారెంట్స్‌కు పిల్లల పెంపకం ఛాలెంజ్ అయినప్పటికీ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలి.
పిల్లల పట్ల అనవసరంగా ఒత్తిడిని, కోపాన్ని ప్రదర్శించకూడదు. ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆయా రోజుల పనుల్ని ఆ రోజే పూర్తి చేయడం ద్వారా ఇటు ఇల్లు, అటు ఉద్యోగంలోనూ పని సాఫీగా సాగిపోతుంది. అలాగే ఇంటికెళ్లిన వెంటనే పిల్లలను పట్టించుకోకుండా ఇంటి పనుల్లో మునిగిపోకండి.
ఇంటికెళ్లాక పిల్లలతో ఒక గంటపాటు గడిపి తర్వాత ఇంటి పనులు చేసుకోండి. ఇంటి పనులు చేసుకుంటూనే అప్పుడప్పుడు పిల్లలతో మాట్లాడుతూ, వారిని నవ్విస్తూ, ఆడిస్తూ వుండాలి. అప్పడప్పుడు పిల్లల్ని షాపింగ్, డిన్నర్లకు తీసుకెళ్లండి.
పిల్లల పట్ల కోపంగానూ, ఆవేశంగానూ కనిపించకూడదు. ఎన్ని ఇబ్బందులున్నా.. వాటిని పిల్లలపై ప్రదర్శించకూడదు. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం, ఆహారం పట్ల అధిక శ్రద్ధ తీసుకోవాలి. పోషకాలతో కూడిన ఆహారం ఇవ్వడం.. ఆరోగ్యం పట్ల అప్పుడప్పుడు ఆరా తీయడం వంటివి చేస్తూ వుండాలి. ఆరోగ్యం-ఆహారం విషయంలో వర్కింగ్ పారెంట్స్ ఏమాత్రం రాజీపడకూడదని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు.