Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పసిప్రాయం వీడకపోతేనేం.. అతడో ఉగ్రవాది...!

పసిప్రాయం వీడకపోతేనేం.. అతడో ఉగ్రవాది...!
ఓ పదకొండు సంవత్సరాల అబ్బాయి పాక్‌ గిరిజన ప్రాంతాల్లోని కొండలను, గుట్టలను దాటుకుంటూ ఆప్ఘాన్‌లో ప్రవేశించాడు. జాకెట్ ధరించిన ఈ అబ్బాయి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు పట్టుకున్నారు. ఇంతకూ ఆ అబ్బాయి జాకెట్లో ఏముందోనని విప్పిచూసిన పోలీసులు నోరెళ్లబెట్టక తప్పలేదు.

ఎందుకంటే... అతడు ధరించిన జాకెట్‌కు భారీగా పేలుడు పదార్థాలు అమర్చి ఉండటం చూసిన పోలీసులు అవాక్కయ్యారు. ఉగ్రవాదిగా ఇంత పసిబాలుడిని తాము ఎప్పుడూ చూడలేదని ఆశ్చర్యపోయారు. దీంతో, కట్టుదిట్టమైన భద్రతగల కాబూల్ జైలుకు అతగాడిని తరలించి, అక్కడే విచారిస్తున్నారు.

ఇంతకూ... పసితనం ఛాయలు ఇంకా వీడని ఆ చిన్నారి పేరు అబ్దుల్లా. పాకిస్థాన్‌లోని పెషావర్‌కు చెందిన ఇతడు.. ఆడుతూ, పాడుతూ, పాఠాలు నేర్చుకుంటూ బాల్యాన్ని ఆస్వాదించాల్సిన ప్రాయంలో ఉగ్రవాదిగా మారిపోయాడు. ఏకంగా ఆత్మాహుతి దాడికి సిద్ధపడ్డాడు. అదృష్టవశాత్తూ పోలీసులకు పట్టుబడటంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

కాబూల్ జైలులో ఉన్న అబ్దుల్లాను ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లిన ఐటీవీ న్యూస్ ఛానల్ అంతర్జాతీయ సంపాదకుడు బిల్ నీలే.. "అమాయకత్వం ఉట్టిపడుతున్న ఆ బాలుడు ఎదురవడంతో నివ్వెరపోయానని" వ్యాఖ్యానించాడు. ఆ అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా అమాయకంగా అనిపించాడని ఆయన చెప్పారు.

అబ్దూల్లాతో మాట్లాడిన అనంతరం నీలే మాట్లాడుతూ... ఆ అబ్బాయి చదువుకునే బడిలో పగలంతా ఖురాను పఠనం, సాయంత్రం ఆయుధాల ప్రయోగంలో శిక్షణ ఇచ్చేవారట. అబ్దుల్లా పదేళ్ల తమ్ముడు అమీన్ కూడా అదే బడిలో చదువుకుంటున్నాడని చెప్పినట్లు నీలే తెలిపారు.

"ఆత్మాహుతి దాడికి దిగితే ముక్కలు ముక్కలై చనిపోతానన్న సంగతి తనకు తెలుసుననీ.. ఆత్మహత్యకు, త్యాగానికీ తేడా కూడా తెలుసనీ, తమ ఇళ్లపై దాడులు చేసి, తమ వారిని చంపకుండా ఉండేందుకు ముస్లిమేతరులను చంపాలనుకుంటున్నానని" అబ్దుల్లా తనకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించినట్లు నీలే వివరించారు.

ఇదిలా ఉంటే... మతవెర్రితో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ, జిహాద్ పేరుతో హత్యాకాండను కొనసాగిస్తున్న ఉగ్రవాదుల ఆగడాలకు, నేరాలకు అంతూ, పొంతూ లేకుండా పోతోంది. ఇప్పటిదాకా జిహాద్ పేరుతో ఆత్మాహుతికి యువతను మాత్రమే పురికొల్పిన అది, ఇప్పుడు పసిపిల్లల జీవితాలతో సైతం ఆడుకుంటోంది. ఇప్పటికైనా ప్రపంచదేశాలన్నీ ఉగ్రవాదుల ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోయినట్లయితే... మరెన్నో దారుణాలను చవిచూడాల్సి వస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu