పర్యావరణంపై ప్రపంచనేతల్ని ప్రశ్నించిన శ్రీవాత్సవ
"
హిమాలయా పర్వతాలు కరిగిపోతున్నాయి.. ధ్రువపు ఎలుగుబంట్లు అంతరిస్తున్నాయి.. ప్రతి ఐదుగురిలో ఇద్దరికి పరిశుభ్రమైన త్రాగునీరు దొరకటం లేదు... ఇలాంటి భూగోళాన్నా మనం మన వారసులకు ఇవ్వాల్సింది..? కానే కాదు....." అంటూ ఏకధాటిగా ప్రసంగించిన చిన్నారి శ్రీవాత్సవ ప్రపంచదేశాల నేతలందరినీ ఆలోచనలో పడేసింది.ప్రపంచంలోని మూడు వందల కోట్లమంది బాలల ప్రతినిధిగా.. అంతర్జాతీయ వేదికమీద, వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి నిర్వహించిన శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగించిన పదమూడేళ్ల ఈ చిన్నారి పేరు యుగరత్న శ్రీవాత్సవ. లక్నోకు చెందిన ఈ అమ్మాయి వాతావరణ మార్పులపై ప్రపంచనేతలందరూ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది."
వాతావరణ మార్పులపై నాకు చాలా ఆందోళనగా ఉంది. వీటిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నేను మిమ్మల్నందరినీ ప్రశ్నిస్తున్నట్లుగా... నా వారసులు నన్ను ప్రశ్నించకూడదని అనుకుంటున్నానని" నిష్కర్షగా ప్రపంచనేతలందరికీ తేల్చిచెప్పేసింది ఈ చిన్నారి. వాతావరణ మార్పులకు రాజకీయ, భౌగోళిక సరిహద్దులు ఉండవనీ.. అవి ఎక్కడయినా జరుగవచ్చు కాబట్టి.. ప్రతి ఒక్కరూ తగిన చర్యలు తీసుకోవాలని శ్రీవాత్సవ కోరింది."
మీరు ఏసీ గదుల్లో కూర్చుని విధానాలు రూపొందించేటప్పుడు.. హరిత వాయువుల వేడితో తల్లడిల్లే ఓ చిన్నారిని, మనుగడ కోసం పోరాడుతుండే జీవజాలాల గురించి కాసేపు ఆలోచించి చూడండ"ని శ్రీవాత్సవ ప్రపంచ నేతలకు సూచించింది. కాగా.. ఈ అంతర్జాతీయ సదస్సులో అమెరికా, చైనా దేశాలు అధ్యక్షులైన ఒబామా, హు జంటావో తదితర వంద దేశాల నేతలు పాల్గొన్నారు. మనదేశం తరపున విదేశాంగ శాఖా మంత్రి ఎస్.ఎం.కృష్ణ, పర్యావరణ శాఖా మంత్రి జైరామ్ రమేష్ హాజరయ్యారు.