చంటి పిల్లలకు జలుబు చేసినప్పుడు ఏం చేయాలి?
చంటి పిల్లలకు జలుబు చేసినప్పుడు ముద్ద కర్పూరం పొడి చేసి కొబ్బరి నూనెలో కలిపి గుండె, గొంతు, వీపు, ముక్కు - వీటి మీద పట్టించి సన్నని వస్త్రం మీద కప్పాలి. దీని వలన లోపల ఉన్న నెమ్ముని చాలా వరకు తీసివేయవచ్చు. చిన్న పిల్లలకు నిమ్మగడ్డి నూనెను చాతిమీద, మెడల మీద రాసి, వెచ్చటి కాపడం పెడితే కఫం కరిగిపోతుంది. చిగుళ్ళ నుండి రక్తం కారుతుంటే ప్రతిరోజూ బ్రష్ చేసుకున్న తర్వాత గోరువెచ్చటి నీటిలో పటిక కలిపి పుక్కిలించాలి. చిగుళ్ల నుంచి రక్తం కారుతుంటే దానిమ్మపూలను మెత్తగా నూరి పండ్లకు, చిగుళ్లకు రాసి బాగా పట్టేటట్లు రుద్దాలి. ఇలా రోజుకు రెండుసార్లు చొప్పున వారం రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చిగుళ్లు, పళ్లకు సంబంధించిన అనారోగ్యం ఉంటే నువ్వులనూనెలో లవంగా నూనె కలిపి వేలితో చిగుళ్ల మీద రుద్దాలి. ప్రతిరోజూ ఉదయాన్నే ఇలా చేస్తుంటే చిగుళ్లు గట్టిపడతాయి. చెవినొప్పితో బాధపడుతుంటే వందగ్రాముల నువ్వుల నూనె లేదా ఆముదంలో రెండుమూడు వెల్లుల్లి రేకులను చిదిమి వేసి వేడిచేయాలి. చల్లారిన తర్వాత నొప్పి ఉన్న చెవిలో రెండు చుక్కల నూనె వేయాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే నొప్పి తగ్గుతుంది. చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి రుగ్మతలకు తేనె, పసుపు చక్కటి విరుగుడు. రోజుకు రెండుసార్లు ఒక టీస్పూను తేనెలో చిటికెడు పసుపు కలిపి తీసుకోవాలి. తేనె లేనట్లయితే ఒక గ్లాసు వేడిపాలలో చిటికెడు పసుపు కలిపి తాగాలి.