వాట్సాప్ తీసుకొచ్చిన నూతన ప్రైవసీ పాలసీపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో వాట్సాప్ స్పందించింది. వినియోగదారుల భద్రతకే తాము మొదటి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేసింది. నూతన ప్రైవసీ పాలసీపై కేంద్ర ఐటీ శాఖ పలు ప్రశ్నలతో కూడిన నోటీసును వారికి పంపింది.
భారత్‌లో మే 15 నుంచి అమలు చేయాలని వాట్సాప్ సూచించిన నూతన ప్రైవసీ పాలసీని ఉపసంహరించుకోవాలని కేంద్రం మే 18న వాట్సాప్ ప్రతినిధులకు లేఖ రాసింది. వారంలోగా స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రం వెల్లడించింది.
ఈ నేపథ్యంలో భారత సర్కారు పంపిన లేఖపై వాట్సాప్ స్పందించింది. వినియోగదారుల గోప్యతే మాకు ప్రధానం అని వారికి హామీ ఇచ్చాము. ఈ ప్రైవసీ పాలసీ వల్ల యూజర్ల వ్యక్తిగత సందేశాల గోప్యతకు భంగం కలుగదు. రాబోయే రోజుల్లో వాట్సాప్ కార్యాచరణలో ఏ మార్పులు ఉండవు. కానీ వినియోగదారులకు ప్రైవసీ పాలసీ గురించి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం'' అని వాట్సాప్ ఒక ప్రకటనలో తెలిపింది.
సమాచార మార్పిడి కోసం చాలా మంది భారతీయులు వాట్సాప్‌పై ఆధారపడుతున్నారని, ఐరోపాలోని వినియోగదారులతో పోలిస్తే భారతీయుల పట్ల వాట్సాప్ వివక్షతో వ్యవహరిస్తోందని కేంద్రం నోటీసుల్లో ప్రస్తావించింది. కొత్త ప్రైవసీ పాలసీకి మే15 వరకు గడువు విధించగా.. అనంతరం దాన్ని వాయిదా వేస్తున్నట్లు వాట్సాప్ సంస్థ ప్రకటించింది.