Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యూజర్ల సెర్చ్ డేటాను డిలీట్ చేసేందుకు సిద్ధమైన గూగుల్!!

Google

ఠాగూర్

, మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (11:41 IST)
వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే లక్షలాది మంది యూజర్ల సెర్చ్‌ డేటాను డిలీట్‌ చేసేందుకు ప్రముఖ టెక్‌ సంస్థ గూగుల్‌ అంగీకరించింది. తద్వారా ఐదు బిలియన్‌ డాలర్ల విలువైన దావాను పరిష్కరించుకునేందుకు సిద్ధమైంది. దీనికి శాన్‌ఫ్రాన్సిస్కో ఫెడరల్‌ కోర్టు అంగీకరిస్తే క్రోమ్‌ 'ఇన్‌కాగ్నిటో మోడ్‌'లో సెర్చ్‌ చేసిన లక్షలాది మంది అమెరికా యూజర్ల డేటాను ఆ సంస్థ డిలీట్‌ చేయాల్సి ఉంటుంది. దీనిపై జులై 30న కోర్టులో విచారణ జరగనుంది.
 
తమ ప్రతిపాదనలో గూగుల్‌ ఎక్కడా పరిహారాన్ని చెల్లిస్తామని తెలియజేయలేదు. అయితే, దీని వల్ల ప్రభావితమయ్యామని భావించిన క్రోమ్‌ యూజర్లు నగదు పరిహారం కోసం ప్రత్యేకంగా దావా వేసుకోవచ్చని పేర్కొనడం గమనార్హం. ఇన్‌కాగ్నిటో మోడ్‌లో గూగుల్‌ అక్రమంగా యూజర్ల డేటాను సేకరిస్తోందని 2020 జూన్‌లో కొంతమంది దావా వేశారు. కంపెనీ అంతర్గత ఈమెయిళ్ల ద్వారా ఇది బహిర్గతమైనట్లు దానిలో పేర్కొన్నారు. దీన్ని వెబ్‌ ట్రాఫిక్‌ అంచనాకు, వాణిజ్య ప్రకటనల ప్రమోషన్‌కు వాడుకున్నట్లు తేలిందని తెలిపారు. దీనికిగానూ ఐదు బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.41,000 కోట్లు) నష్టపరిహారాన్ని డిమాండ్‌ చేశారు.
 
ఇన్‌కాగ్నిటో మోడ్‌లో సెర్చ్‌ చేయడం వల్ల ఆ డేటా బయటకు పొక్కదనే నమ్మకం యూజర్లలో ఉందని దావాలో పేర్కొన్నారు. కానీ, వారి విశ్వాసాన్ని వమ్ము చేస్తూ గూగుల్‌ ఆ డేటాను సేకరించడం అనైతికమని పేర్కొన్నారు. తప్పుడు సమాచారం ద్వారా యూజర్లను మోసగించడమేనని తెలిపారు. పైగా ఇది వారి గోప్యతకు భంగం కలిగించినట్లేనని వాదించారు. అత్యంత వ్యక్తిగత సమాచారాన్ని వాణిజ్య ప్రకటనల ప్రమోషన్‌కు వాడుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. 
 
ఈ దావాలో ఎలాంటి పసలేదని.. అయినప్పటికీ దీన్ని పరిష్కరించుకునేందుకు అంగీకరిస్తున్నామని గూగుల్‌ అధికార ప్రతినిధి జార్జ్ కాస్టానెడ అన్నారు. తాము సేకరించిన డేటాలో యూజర్ల వ్యక్తిగత సమాచారమేమీ లేదన్నారు. కేవలం అది సాంకేతికపరమైనదేనని చెప్పారు. దాన్ని ఎలాంటి ఇతర అవసరాలకు వాడుకోలేదని పేర్కొన్నారు. అయినా, దాన్ని కూడా డిలీట్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లిబియా ప్రధానమంత్రి అబ్దుల్ హమీద్ నివాసంపై రాకెట్ దాడి...