యాపిల్ సంస్థ తన కలను నిజం చేసుకుంది. ముందుగా ప్రకటించినట్టుగానే ఐ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఏ ఒక్కరినీ నిరాశకు గురి చేయరాదని భావించిన తన పాత సంప్రదాయం ప్రకారం తన కొత్త ఉత్పత్తిని మంగళవారం విడుదల చేసింది. ఐఫోన్ 6 పేరిట కొత్త మొబైల్ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇప్పటి వరకు విడుదల చేసిన ఐఫోన్ లన్నింటిలోకీ ఐఫోన్ 6 అత్యున్నతమైనదని ఆ సంస్థ ప్రకటించింది. ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ పేరిట రెండు వెర్షన్లలో విడుదలైన రెండు ఐఫోన్లు ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచంలోని అన్ని దేశాల మార్కెట్లలో అందుబాటులోకి రానున్నాయి.
అమెరికాలో మాత్రం ఈ నెల 19 నుంచి వినియోగదారులకు తమ కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తేనున్నట్లు యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వెల్లడించారు. అమెరికాలోని కుపర్టినిలో కిక్కిరిసిన విలేకరుల సమావేశంలో ఐఫోన్ 6, 6 ప్లస్‌లను విడుదల చేసిన టిమ్ కుక్, ఐవాచ్‌ను కూడా విడుదల చేశారు. అమెరికాలో ఐఫోన్ 6 ధర 199 డాలర్ల నుంచి ఫ్రారంభంకానుండగా, ఐఫోన్ 6 ప్లస్ ధర 299 డాలర్ల నుంచి ప్రారంభం కానుంది. ఇక కొత్త ఉత్పత్తి ఐవాచ్ ధరను మాత్రం యాపిల్ వెల్లడించలేదు.
ప్రపంచ మొబైల్ వినియోగదారులను నెలల తరబడి వేచి చూసేలా చేసిన ఐఫోన్ 6 స్క్రీన్ 4.7 అంగుళాలు, ఐఫోన్ 6 ప్లస్ స్క్రీన్ 5.5 అంగుళాలుగా ఉంది. ఇప్పటిదాకా అందుబాటులోకి వచ్చిన ఐఫోన్లన్నింటిలోకి ఐఫోన్ 6 అతి పలుచగా ఉండటంతో వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే, భారత్‌లో మాత్రం ఈ తరహా ఫోన్లు వచ్చే నెల 17వ తేదీన వస్తాయని భావిస్తున్నారు.