"రంజాన్" ఉపవాస వ్రతాన్ని ఇలా ఆచరిస్తారు!
మహమ్మదీయుల క్యాలెండర్ ప్రకారం తొమ్మిదో నెలలో వచ్చే నెల "రంజాన్". దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు. దానికి ప్రధాన కారణం ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ఈ మాసంలో ఆవిర్భవించడమే. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ఈ రంజాన్ మాసం. ఈ రంజాన్ మాసంలో మహమ్మదీయులంతా ఉపవాసవ్రతం ఆచరిస్తారు. పార్సీ భాషలో "రోజా", అరబ్బీలో సౌమ్ అని పిలువబడే ఈ వ్రతాన్ని.. రంజాన్ మాసం ప్రారంభమైన నాటి నుంచి ముగిసే వరకు ముస్లింలు నిష్టగా ఉపవాస దీక్షలను పాటిస్తారు.కేవలం ఆహార పానీయాలను మానివేయడమే గాకుండా.. తెల్లవారుజామున భోజనం చేసిన తర్వాత ఆ రోజంతా ఉపవాసం ఉండే భక్తులు సాయంత్రం సూర్యాస్తమం తర్వాత దీక్షను విరమిస్తారు. తెల్లవారుజామున ఆహారం తీసుకోవడాన్ని "సహర్" అని, సాయంత్రం ఉపవాస వ్రత దీక్ష విరమణలో తీసుకునే ఆహారాన్ని "ఇఫ్తార్" అని అంటారు.అంటే రంజాన్ నెలలో ప్రతిరోజూ సూర్యోదయం పూర్వం నుంచి సూర్యాస్తమం వరకు సుమారు 13 గంటల పాటు కఠిన ఉపవాస దీక్షలు పాటిస్తారు. ఉపవాసదీక్ష పాటించేవారు అసత్యాలు పలకకుండా, పరనిందకు పాల్పడకుండా, శారీరిక, మానసిక వాంఛలకు దూరంగా, నిగ్రహంగా ఉంటూ ఆసాంతం దైవచింతనతో గడుపుతూ ఉంటారు. ఇలా మనిషిలో దైవభీతి, దేవుడిపట్ల నమ్మకం మొదలైన మహత్తరమైన సుగుణాలను పెంపొందింపజేసే రంజాన్ ఉపవాస విధి ఈ నెల 22 నుంచి ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మహమ్మదీయులంతా ఉపవాసవ్రతాన్ని ఆచరిస్తున్నారు.రంజాన్ నెలలో రెండో శుక్రవారమైన (28వతేదీ) మసీదులు భక్తులతో నిండిపోయాయి. దర్గాల్లో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో వేలాది మంది భక్తులు పాల్గొంటున్నారు.