కరోనా వైరస్ దేశంలో విస్తృతంగా వ్యాపిస్తోంది. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రీడా పోటీలు రద్దు అయిన నేపథ్యంలో కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరుగుతుందా? లేదా అనేది సందిగ్ధంలో పడింది. అంతేగాకుండా.. ట్వంటీ-20 ప్రపంచ కప్‌పై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. అక్టోబర్-నవంబర్‌లో జరిగే టీ-20 ప్రపంచ కప్ జరుగుతుందా లేదా అనేది తెలియాల్సి వుంది.
ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఈ ఈవెంట్‌పై ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన ఏదీ రాకపోయినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో టోర్నీని నిర్వహించడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ఒకవేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుని టీ20 వరల్డ్ కప్ రద్దు లేక వాయిదా పడితే… ఆ విండోను ఐపీఎల్ కోసం ఉపయోగించుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.
దాదాపు మూడు వారాల సమయం ఉంటుంది కాబట్టి లీగ్ మొత్తం లేక మినీ ఐపీఎల్ నిర్వహించాలనే ఆలోచన చేస్తోంది. ‘ప్రస్తుతం చాలా దేశాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. సరిహద్దులన్నీ మూతపడ్డాయి. ఆస్ట్రేలియాలో అయితే ఆరునెలల పాటు లాక్ డౌన్ ఉంటుందని చెబుతున్నారు.
ఇలాంటి పరిస్థితిలో ఐపీఎల్‌కు అక్టోబర్, నవంబర్ విండో సేఫ్ అని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి టోర్నీని రద్దు చేయడమో లేక వాయిదా వేయడమో చేస్తే ఐపీఎల్ టోర్నీ అక్టోబరులో జరిగే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ టీ20 వరల్డ్ కప్ను ఐసీసీ వాయిదా వేస్తే.. ప్రస్తుత ఎఫ్టీపీ ప్రకారం తిరిగి 2022లోనే జరిపే అవకాశం ఉంది.