గత ఏడాది ఐపీల్ రన్నరప్: ఈ ఏడాది కింది నుంచి మూడో స్థానం.. కోహ్లీ టీమ్‌కు ఏమైంది?
ఐపీఎల్-9 సీజన్‌లో అంటే గత ఏడాది వీర విజృంభణతో ఏకంగా ఫైనల్ వరకూ వెళ్లిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అత్యంత అవమానకరంగా ఐపీఎల్ 10 సీజన్‌నుంచి నిష్క్రమించడం ఐపీఎల్ అభిమానులను నిర్ఘాంతపరిచింది. ఐపీఎల్ లో పటి
ఐపీఎల్-9 సీజన్‌లో అంటే గత ఏడాది వీర విజృంభణతో ఏకంగా ఫైనల్ వరకూ వెళ్లిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అత్యంత అవమానకరంగా ఐపీఎల్ 10 సీజన్‌నుంచి నిష్క్రమించడం ఐపీఎల్ అభిమానులను నిర్ఘాంతపరిచింది. ఐపీఎల్ లో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుస వైఫల్యాలతో ప్లే ఆఫ్ అవకాశాన్ని కోల్పోయింది. గత సీజన్లో సమిష్టంగా రాణించి ఫైనల్లో వరకూ వెళ్లిన ఆర్సీబీ.. ఈ సీజన్ లో అత్యంత చెత్త ప్రదర్శనతో అభిమానులను నిరాశ పరిచింది. భయంకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న బెంగళూరు బ్యాట్స్ మెన్ లు బ్యాట్ ఝలిపించక పోవడంతో వరుస వైఫల్యాలను మూటగట్టుకుంది. జట్టులోని ప్రధానమైన బ్యాట్స్ మెన్ లో ఏ ఒక్కరు టాప్-10 లిస్టులో లేకపోవడం గమనార్హం. ఇక కోల్‌కతాపై 49 పరుగులకు కుప్పకూలి సగటు క్రికెట్ అభిమానిని ఆశ్చర్య పరిచింది. ఇది బెంగళూరు జట్టేనా అనే అనుమానం కలిగింది.
ఇక బౌలింగ్‌లో కూడా ప్రత్యర్ధులను కట్టడి చేయడంలో విఫలమైంది. జట్టులోని ప్రధాన ఆటగాళ్ల ప్రదర్శన పరిశీలిస్తే బ్యాటింగ్ లో కెప్టెన్ కోహ్లీ, బౌలింగ్ విభాగంలో చాహాల్ తప్ప ఎవరూ వారి స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయారు. మరోవైపు ఆటగాళ్ల గాయాలు కూడా బెంగళూరును వెంటాడాయి. ఓపెనర్ కే ఎల్ రాహుల్, యువ బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ ఖాన్ లు ఈ సీజన్ మొత్తానికి దూరం కాగా, కెప్టెన్ కోహ్లీ, విధ్వంసకర ఆటగాడు డివిలియర్స్ తొలి మ్యాచులకు దూరమయ్యారు. దీంతో జట్టు తగిన మూల్యం చెల్లించుకోంది. ఇక ప్రధానమైన ఆటగాళ్ల ఆటను పరిశీలిస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది.
ఈ సీజన్ తొలి మ్యాచుల్లో గాయం కారణంగా దూరమైన కోహ్లీ, వచ్చిరావడంతో తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్న జట్టును గెలిపించలేకపోయాడు. ఏడు ఇన్నింగ్స్ ల్లో 124.47 స్ట్రైక్ రేట్ తో కోహ్లీ 239 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధసెంచరీలున్నాయి. గత సీజన్ లో 4 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలతో దూకుడుగా ఆడిన కోహ్లీ 973 పరుగులతో టాప్ లో నిలిచాడు. ఒంటి చేత్తో మ్యాచ్ లు గెలిపించి జట్టును ఫైనల్ కు చేర్చాడు. ఈ సీజన్ లో మాత్రం అతని స్ధాయికి తగిన ప్రదర్శన కనబర్ఛకపోవడంతో బెంగళూరు వరుస వైఫల్యాలను మూటగట్టుకుంది.
విధ్వంసకర బ్యాటింగ్ కు నిర్వచనంగా చెప్పుకునే మిస్టర్ 360 ఒకే ఒక మ్యాచ్ తప్ప అన్ని మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. 7 ఇన్నింగ్స్‌లు ఆడిన డివిలియర్స్ 131.54 స్ట్రైక్ రేట్‌తో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. గత సీజన్‌లో ఒక సెంచరీ 6 హాఫ్ సెంచరీలతో 687 పరుగులతో టాప్-3 లో నిలిచాడు. ఈ సీజన్ లో మాత్రం కేవలం ఒకే ఒక అర్ధసెంచరీతో బెంగళూరు అభిమానులను తీవ్రంగా నిరాశపర్చాడు. డివి ఆడిన ఏ ఒక్క మ్యాచ్‌లోనూ బెంగళూరు గెలవకపోవడం విశేషం.
బెంగళూరును తీవ్రంగా నిరాశపరిచింది క్రిస్ గేల్. హిట్టింగ్ అంటనే గేల్, గేల్ అంటేనే హిట్టింగ్ అన్నట్లు ఉండే అతని బ్యాటింగ్. ఈ సీజన్‌లో మాత్రం అతని బ్యాట్ మూగబోయింది. జట్టులో ఎప్పుడు కీలక ఆటగాడిగా ఉండే గేల్ ఈ సీజన్ లో జట్టులో చోటుకోసం పోటి పడాల్సి వచ్చింది. ఒకే ఒక మ్యాచ్ లో 77 పరుగులతో ఆకట్టుకున్న గేల్ 6 ఇన్నింగ్స్ ల్లో 124.59 స్ట్రైక్ రేట్ తో కేవలం 152 పరుగులు మాత్రం చేశాడు.