'తొలిప్రేమ', 'బాలు', 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'డార్లింగ్' వంటి ప్రేమకథా చిత్రాలతో లవ్‌స్టోరీస్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు ఎ.కరుణాకరన్. లేటెస్ట్‌గా నితిన్ హీరోగా విక్రమ్‌గౌడ్ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై ఎన్.సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్న 'చిన్నదాన నీకోసం' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఈ నెల 25న క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ కరుణాకరన్‌తో ఇంటర్వ్యూ..
నితిన్‌తో సినిమా ఎలా మొదలైంది?
నితిన్‌తో సినిమా చెయ్యాలని ఎప్పటినుంచో అనుకున్నాను. తనతో సినిమా చేస్తానని నేనే అడిగాను. దానికి సందర్భం వచ్చింది. ఈ సినిమా స్టార్ట్ అయింది. సినిమా చాలా బాగా వచ్చింది. ఎగ్జామ్ రాసి కూర్చున్న స్టూడెంట్‌లా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను.
ప్రేమకథల్లో మీకంటూ ఒక ట్రెండ్ వుంది. దీన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నారు?
అమ్మాయి వెంట అబ్బాయి పడతాడు. అది కామన్‌గా జరుగుతూనే వుంటుంది. ఈ సినిమాలో కూడా అదే జరిగింది. అయితే ఇందులో కొన్ని కొత్త ఎలిమెంట్స్ వున్నాయి. అది సినిమా చూస్తేనే అర్థమవుతుంది.
హీరో క్యారెక్టరైజేషన్ ఎలా వుంటుంది?
ఒక నార్మల్ కుర్రాడు. మన పక్కింటి కుర్రాడిలా వుంటాడు. పవన్ కళ్యాణ్ అభిమాని. ఆ అబ్బాయి ప్రేమలో ఎలా పడ్డాడు, దాని కోసం ఏం చేశాడు అనేది కథ.
ఈ సినిమాలో స్పెషాలిటీ ఏమిటి?
డార్లింగ్, ఎందుకంటే ప్రేమంట చిత్రాల్లో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ వుంటాయి. ఈ సినిమాలో కూడా క్లైమాక్స్‌లో అందర్నీ థ్రిల్ చేసే ఒక సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ వుంది. దాన్ని తప్పకుండా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.
మీరు లవ్‌స్టోరీస్ బాగా తీస్తారన్న పేరు వుంది. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా వుంటుందా?
ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా అలాగే వున్నాయి. నువ్వు ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పు అన్నట్టుగా వుంది కాబట్టి వారికి నచ్చేలా సినిమా తియ్యడమే కరెక్ట్. అంతేగానీ మనకి నచ్చినట్టు సినిమా తీస్తే చూడరు. ఫ్యామిలీ అంతా రెండున్నర గంటలు చూసి ఎంజాయ్ చెయ్యాలన్నదే నా యాంబిషన్.
ప్రేమకథే ఒకటి ప్లాప్ అయిందికదా. అది ఏ పాఠం నేర్పింది?
అవును. ఎందుకంటే ప్రేమంట.. అనే సినిమాను చేశాను. తీసినప్పుడు బాగుంది. కానీ తర్వాత ప్రేక్షకులు తీర్పు ఇచ్చినదాన్నిబట్టి ఇలా తీయకూడదా.. ఇవి వుండకూడదా... అనిపించింది. నితిన్ సినిమాలో అలాంటి మార్పులు చేశాను.
పవన్ కళ్యాణ్ పేరు బాగా వాడుకుంటున్నారు?
నేను, నితిన్ కూడా పవన్ అభిమానులమే. అందుకోసం ఆ పేరును వాడుకున్నాం. ఎక్కడా అతి అనిపించదు. హీరో పవన్ అభిమాని. అతను ఏమి చేశాడు అనేది సినిమాలో ఆసక్తికరం అని ముగించారు కరుణాకరున్.