లారెన్స్‌ని నా నడుము పైకి ఎగిరి దూకమన్నా: కోవై సరళ
, బుధవారం, 27 జులై 2011 (20:21 IST)
కోవైసరళ.. ఈ పేరుకు పరిచయ వాక్యాలు అవసరంలేదు. ఆమె ప్రతిపాత్రను సహజంగా పోషిస్తుంది. ఆవేశం, ఆనందం, రౌద్రం వంటి రసాల్ని అవలీలగా పోషించే ఆమెకు దెయ్యమంటే భయమట. తాజాగా 'కాంచన' చిత్రంలో నటించింది. దాదాపు లారెన్స్ తర్వాత ఆమే సినిమాను మోసింది. ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడింది.
'
కాంచన' రిలీజ్ తర్వాత ఎలాంటి స్పందన లభించింది? చాలా సంతోషంగా ఉంది. హిట్ ఇచ్చాక మీ అందరితో మాట్లాడే అవకాశం కల్గింది. ఆర్టిస్టుకు మంచి పాత్ర దొరకడం అదృష్టం. చాలాకాలం గ్యాప్ తర్వాత మంచి పాత్ర వేశాను. నా పాత్రకు పేరు రావడానికి కారణం రచయిత, దర్శకుడు లారెన్స్. ఈ క్రెడిట్ అంతా ఆయనకే చెందుతుంది.
ఈ చిత్రంలో పాత్ర చెప్పినప్పుడు ఎలా ఫీలయ్యారు? ఒక సినిమాలో ఎంతసేపు కనిపించాం. ఎలాంటి పాత్ర చేశాం... అనే విషయం ముఖ్యంకాదు. నలుగుర్ని మెప్పించిన ఒక మంచి సినిమాలో నటించామంటే చాలు. అటువంటి పాత్ర నాకు ఈ కథ చెప్పినప్పుడు అనిపించింది.
తమిళంలో ఎలాంటి స్పందన వచ్చింది? తెలుగుకంటే తమిళంలో ఆలస్యంగా విడుదలైంది. ఈనెల 22న విడుదలైంది. పెద్ద హిట్ అయిందని ఫోన్లు వస్తున్నాయి.
శతర్‌కుమార్ పాత్ర ఎలా అనిపించింది? శరత్‌కుమార్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ పోషించారు. హిజ్రా గెటప్‌లో అద్భుతంగా ఉన్నారు. ఆయన్ను లారెన్స్ ఒప్పించడం గ్రేట్. మేన్లీగా ఉండే శరత్‌కుమార్ చేయడం చాలా గొప్ప విషయం. మొదట విన్నప్పుడు ఎలా చేయిస్తాడో అనుకున్నాను. ఇందులో గ్రాఫిక్ వర్క్ చాలా నాచురల్‌గా ఉన్నాయి.
షూటింగ్ ఎలా జరిగింది? ఎక్కువగా రాత్రిళ్ళు జరిగింది. రోజూ 3 గంటల నుంచి మార్నింగ్ 7 గంటలకు ఇంటికి వెళ్ళేవాల్ళం. ఈ షూటింగ్ అప్పుడు నిద్ర సరిగ్గా పట్టేదికాదు.
కథ విన్నప్పుడు ఎలా ఫీలయ్యారు? దెయ్యం సినిమా అంటే భయం భయంగా ఉంటుంది. కానీ ఈ చిత్రంలో నవ్వుతూనే భయం చూపారు. అదే ప్రత్యేకత.
లారెన్స్ గభాల్న నడుపైకి ఎక్కినప్పుడు ఎలా అనిపించింది? లారెన్స్ చిన్న పిల్లాడిలా చేసినప్పుడు నడుపైకి కూర్చొంటానని చెప్పారు. ఆర్టిస్టుగా చేస్తానన్నాను. ముందు ఆయనే భయపడ్డారు. సీనియర్ ఆర్టిస్టులు గభాల్న జంప్ చేస్తే పడిపోతారేమోనని ఆయన కంగారుపడ్డారు. నేను 'మైండ్ కంట్రోల్'తో రెడీ అన్నాను. ఆయన పరుగెత్తి నడుపుపైకి జంప్ చేశారు. షాట్ బాగా రావాలని మీరు దూకండి అని ప్రోత్సహించాను. మొదటిసారి జంప్ చేసినప్పుడు కాస్త పడిపోబోయా.. కానీ తమాయించుకుని స్టడీగా నిలబడ్డా. దానికి ఆయన హ్యాట్సాప్ చెప్పారు.
కోడలు పాత్రలో చేయడం ఎలా అనిపించింది? దేవదర్శిని కోడలుగా నటించింది. ఆమె నాతో మొదటిసారిగా చేసింది. ఆమెతో దెయ్యం ఉందా లేదా అనేది టెస్ట్ చేయడానికి రాత్రుల్ళు ఏడు రోజులు చేశాం. ఆ టైమ్‌లో ఆ అమ్మాయి నన్ను కొట్టింది. దానికి ఏదైనా ఆ అమ్మాయిని చేయాలనుకున్నా. లారెన్స్‌కు దెయ్యం ఆవహించినప్పుడు చిన్నబ్బాయి పాత్ర వేశాడు. ఇప్పుడు అమ్మాయికు 'షో' చూపించాలని.. లారెన్స్‌తో... ఈ అమ్మాయి నన్ను ఏడిపిస్తుంటే.. ఒంటరిగా చూస్తుంది. ఆమెను నువ్వు పైకి ఎత్తితే సీన్ బాగా పండుతుంది అని చెప్పాను. వెంటనే.. ఈ సీన్ బాగుందని. దెయ్యం ఆవహించిన లారెన్స్ ఆమెను పైకి ఎత్తేస్తాడు. దానికి రోప్‌లతో ఆమె పడిన కష్టాలు నవ్వు తెప్పించాయి. ఆ షాట్ తర్వాత.... నాపై రివెంజ్ తీసుకున్నారా? అని అంది. ఇదంతా చాలా స్పోర్టివ్‌గా చేశాం. ఊరికే చెప్పిన ఆ సీన్‌కు పెద్ద రెస్పాన్స్ వచ్చింది.
ఆర్టిస్టుల సహకారం ఎలా ఉంది? చాలా బాగుంది. లారెన్స్ నేను ఏం చెప్పినా దాన్ని పాజిటివ్‌గా తీసుకునేవారు. ఎక్కడా ఇగో అనేది లేదు. ఏదైనా చెప్పినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి మనస్సు కావాలి. అందరి సహకారంతోనే హిట్ అయింది.
తమన్ సంగీతం ఎలా ఉంది? సంగీత దర్శకుడు తమన్ చాలా చిన్నబ్బాయి. ట్యూన్ సరిగ్గా రాకపోతే గ్రౌండ్‌కెళ్ళి క్రికెట్ ఆడుకునేవాడు. ఇందులో సాంగ్స్ లారెన్స్ రాసుకున్నాడు. ట్యూన్స్ బాగా ఇచ్చాడు తమన్.
షూటింగ్‌లో గ్యాప్ వస్తే ఏం చేసేవారు? గ్యాప్ వస్తే పాటలు, ఆటలు ఆడుకునేవాళ్ళం.
శ్రీమాన్ నటన ఎలా ఉంది? శ్రీమాన్ మంచి నటుడు. మంచి కమేడియన్. చిన్న చిన్న రియాక్షన్ కూడా బాగా చేశాడు. నేను అన్నం తినేటప్పుడు విసేరేస్తాను. అది ఆయన ఫేస్‌పై పడినప్పుడు వెంటనే తుడుచుకుంటాడు. ఇలా స్పాంటేనియస్‌గా చేసేవాడు. ఆయనపై మరిన్ని షాట్స్ వున్నాయి. కానీ డ్యూరేషన్ వల్ల తగ్గాయి.
లక్ష్మీరాయ్ పాత్ర ఎలా ఉంది? అందమైన అమ్మాయి. డాన్స్ బాగా చేసింది.
నిర్మాత బెల్లంకొండ సురేష్ గురించి? నేను ఇంతవరకు ఆయన్ను చూడలేదు. ఫోన్‌లోనే ఆయనతో మాట్లాడేదాన్ని. తెల్లగా, నల్లగా, ఎత్తుగా ఎలా ఉంటాడో తెలీదు. ఆఫీసుకు వచ్చినా ఇప్పుడు కూడా ఆయన్ను చూడలేకపోయాను. ('కాంచన'ను చూసి భయపడ్డారేమో అందుకే రావడంలేదని.. చమత్కరించారు). ఈ పాత్ర గురించి ఆయన నాకు ఫోన్ చేసినప్పుడు.. క్షేమంగా వెళ్ళి లాభంగా రండిలా మంచి పేరు వస్తుందని చెప్పారు.
పార్ట్-3లో ఉంటారా? దర్శకుడే తేల్చాలి. ఈ రోజుల్లో సినిమా తీశాక నిర్మాతకు డబ్బులు రావడం చాలా కష్టం. అటువంటి సక్సెస్ ఇచ్చిన లారెన్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి.
మీరు దెయ్యంమంటే భయపడతారా? అమ్మో దెయ్యమంటే భయమే. షూటింగ్ చేసినప్పుడు రాత్రిళ్ళు ఒంటరిగా వెళ్ళాలంటే భయపడేదాన్ని.
ఇంత పేరు రావడంపై మీరెలా స్పందిస్తారు? చిత్ర పరిశ్రమలో గుర్తింపు మనం కోరుకుంటే రాదు. వచ్చిన గుర్తింపు కాపాడుకోవడమే మన చేతిలో ఉంది. నా గొంతు, నేను పలికించే హావభావాలు నా ప్రత్యేకతలుగా అనుకుంటాను. ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు. వారికి కృతజ్ఞతలు అని ముగించింది కోవై సరళ.