Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 30 April 2025
webdunia

అమెరికా ఎన్నికల్లో భారతీయుల హవా!

Advertiesment
US President Elections
, శుక్రవారం, 6 నవంబరు 2020 (09:26 IST)
అమెరికా అధ్యక్ష పీఠానికి జరిగిన ఎన్నికల్లో భారతీయులు తమ హవా కొనసాగించారు. ఈ ఎన్నికల్లో పలువురు ఇండియన్స్ విజయభేరీ మోగించాు. అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధుల సభ, వివిధ రాష్ట్రాల ప్రతినిధుల సభలు, సెనేట్‌లు, ఇంకొన్ని పదవులకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు ఈ సారి తమ సత్తా చాటారు. 
 
ఇప్పటి వరకు మొత్తం 18 మంది ఇండియనస్ విజయభేరీ మోగించారు. మరో ఇద్దరు విజయపథంలో ఉన్నారు. రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో 13 మంది విజయం సాధించగా.. వారిలో ఐదుగురు మహిళలే కావడం గమనార్హం. డెమోక్రాటిక్‌ పార్టీ తరపున ప్రతినిధుల సభకు డాక్టర్‌ అమీ బెరా, ప్రమీలా జయపాల్‌, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి ఇప్పటికే ఎన్నికయ్యారు. 
 
అలాగే, అదే పార్టీ తరపున డాక్టర్‌ హీరల్‌ తిపిర్నేని అరిజోనాలో ముందంజలో ఉన్నారు. రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచిన మహిళల్లో జెనిఫర్‌ రాజకుమార్‌ (న్యూయార్క్‌-ప్రతినిధుల సభ), నీమా కులకర్ణి (కెంటకీ-సభ), కేశా రామ్‌ (వెర్మాంట్‌-సెనేట్‌), వందన స్లాటర్‌ (వాషింగ్టన్‌-సభ), తెలుగు మహిళ పద్మ కుప్ప (మిచిగన్‌-సభ) డెమోక్రాటిక్‌ పార్టీ తరపున గెలిచారు. 
 
ఇకపోతే, విజేతల్లో రిపబ్లికన్‌ పార్టీకి చెందిన నీరజ్‌ అంతానీ (ఒహాయో-సెనేట్‌), డెమోక్రాట్‌ పార్టీకి చెందిన జే చౌధురి (నార్త్‌ కరొలినా-సెనేట్‌), అమీష్‌ షా (అరిజోనా-సభ), నికిల్‌ సవాల్‌ (పెన్సిల్వేనియా-సెనేట్‌), రాజీవ్‌ పురి (మిచిగాన్‌-సభ), జెరిమీ కూనీ (న్యూయార్క్‌-సెనేట్‌), యష్‌ కల్రా (కాలిఫోర్నియా-సభ-మూడోసారి) కూడా ఉన్నారు. 
 
టెక్సాస్‌ జిల్లా జడ్జి ఎన్నికల్లో రవి సందిల్‌ (డెమోక్రాట్‌) విజయం సాధించారు. డెమోక్రాట్లు రూపండే మెహతా (న్యూజెర్సీ సెనేట్‌), నీనా అహ్మద్‌ (పెన్సిల్వేనియా ఆడిటర్‌ జనరల్‌) ఆధిక్యంలో ఉన్నా.. ఇంకా వీరి విజయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. 
 
అలాగే కొందరు ప్రముఖ భారతీయ అమెరికన్లు పరాజయం పాలయ్యారు. జాతీయ ప్రతినిధుల సభకు పోటీచేసిన డెమోక్రాట్లు శ్రీ ప్రెస్టన్‌ కుల్‌కర్ణి (టెక్సాస్‌), మంగ అనంతాత్ముల (వర్జీనియా), రిపబ్లికన్లు నిషా శర్మ, రితేశ్‌ టాండన్‌ (కాలిఫోర్నియా).. అలాగే మెయిన్‌, న్యూజెర్సీ నుంచి సెనేట్‌కు పోటీచేసిన డెమోక్రాట్లు సారా గిడియోన్‌, రిక్‌ మెహతా ఓడిపోయారు. 
 
అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర దిశగా ఈ సారి భారతీయ అమెరికన్లు పెద్ద ముందడుగే వేశారని 'ఇంపాక్ట్‌ ఫండ్స్' సంస్థకు చెందిన నీల్‌ మఖీజా తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్నికల బరిలోకి దిగిన భారతీయ అమెరికన్‌ అభ్యర్థుల కోసం ఈ సంస్థ కోటి డాలర్లు సేకరించడం విశేషం. భారతీయ అభ్యర్థులు, ఓటర్లు తమ పలుకుబడిని, పురోభివృద్ధిని చాటారని.. మిచిగాన్‌, పెన్సిల్వేనియాలో వారి ఓట్లు కీలకం కానున్నాయని మఖీజా వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

325వ రోజుకు రాజధాని నిరసనలు