శ్రీలంక కొలంబో నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగరం రణరంగంగా మారింది. నిరసనకారులు-ప్రభుత్వ మద్దతుదారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ క్రమంలో నిరసనకారులు పాలక ఎంపీల ఇళ్లపైనా, ఆస్తులపైనా దాడులు చేసారు.
అధికార పార్టీ ఎంపి అమరకీర్తి కారును నిరసనకారులు అడ్డుకోగా ఆయన తుపాకీతో నిరసనకారులపై కాల్పులు జరిపారు. దీనితో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఫలితంగా తీవ్ర ఆగ్రహానికి లోనైన నిరసనకారులు ఆయనపై దాడి చేసి హత్య చేసినట్లు అక్కడి జాతీయ మీడియా తెలిపింది.
పరిస్థితులను దారిలోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కర్ఫ్యూను ప్రకటించారు. ఇదిలావుండగా గత కొన్నిరోజులుగా శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ధరలు ఆకాశాన్నంటాయి. నిత్యావసర వస్తువులు లభించక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చడంతో ప్రధాని మహీంద రాజపక్స తన పదవికి రాజీనామా చేసారు.