బ్రిటన్‌లో అరెస్టు అయిన భారత వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి బెయిల్ ఇప్పించేందుకు ఆయన తరపు న్యాయవాదులు చేయని ప్రయత్నమంటూ లేదు. ఇందుకోసం ఏకంగా కోర్టునే తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. నీరవ్ ఇంట్లో ఉన్న కుక్క సంరక్షణా బాధ్యలు చూసుకునేందుకు మనుషులు లేరని అందువల్ల తన క్లైయింట్‌కు బెయిలివ్వాలని వారు కోర్టును కోరారు. వీరి వాదనలు విన్న న్యాయమూర్తులు విస్తుపోయారు.
ప్రస్తుతం నీరవ్ మోడీని లండన్ పోలీసులు అరెస్టు చేసి జైల్లో బంధించివున్నారు. ఆయన్ను విడిపించేందుకు నీరవ్ న్యాయవాదుల బృందం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కంటికి కనిపించిన ప్రతి సాకూ చూపించింది. కానీ న్యాయమూర్తి ఎమ్మా ఆర్బుట్‌నాట్ మాత్రం కరగలేదు. సాక్ష్యాలను తారుమారు చేసే ముప్పు ఉండటంతో నిరాకరించారు.
'నీరవ్ కుమారుడు చార్టర్‌హౌస్(లండన్‌లో ఒక స్కూలు)లో ఉన్నాడు. ఇప్పుడు విశ్వవిద్యాలయానికి వెళ్లాల్సి ఉంది. దీంతోపాటు ముసలి తల్లిదండ్రుల బాధ్యత కూడా నీరవ్‌పైనే ఉంది. ఆయన కుక్క సంరక్షణ కూడా చూసుకోవాలి. అయినా ఆయన పారిపోతాడనటం మూర్ఖత్వం. ఆయన ఎక్కడికి వెళ్లేందుకు గానీ, నివసించేందుకు గానీ దరఖాస్తు చేసుకోలేదు. ఆయన ఇక్కడ ఉండేందుకు అర్హత సాధించారు' అని పేర్కొన్నారు.
కానీ ఈ వాదనను భారత్ తరఫున క్రౌన్ ప్రాసిక్యూషన్ కొట్టిపారేసింది. నీరవ్‌కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను నాశనం చేస్తాడని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు.