పాకిస్థాన్ దేశంలో సోమవారం అర్థరాత్రి బాంబు పేలుడు సంభవించింది. ఈ దేశంలోని బలూచిస్తాన్‌లోని పంజ్‌గూర్ జిల్లాలో ఒక వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు దుండగులు ల్యాండ్‌మైన్ పేల్చారు. ఈ పేలుడులో యూనియన్ కౌన్సిల్ ఛైర్మన్ సహా కనీసం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
సోమవారం సాయంత్రం ఒక వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్న బల్గతార్ యూసీ ఛైర్మన్ ఇష్తియాక్ యాకూబ్‌తో పాటు వాహనంలో ప్రయాణిస్తున్న ఇతరులను లక్ష్యంగా చేసుకుని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రిమోట్ సాయంతో పేల్చడానికి ల్యాండ్‌మైన్ అమర్చారని పంజ్‌గూర్ డిప్యూటీ కమిషనర్ అమ్జద్ సోమ్రో తెలిపారు.
వాహనం బల్గతార్ ప్రాంతంలోని చకర్ బజార్ దగ్గరకు రాగానే దుండగులు రిమోట్ సాయంతో వాహనాన్ని పేల్చివేశారని ఫలితంగా అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మరణించినట్టు స్థానికులు చెప్పారు. మృతుల్లో మహ్మద్ యాకూబ్, ఇబ్రహీం, వాజిద్, ఫిదా హుస్సేన్, సర్పరాజ్, హైదర్‌గా గుర్తించారు. వీరంతా బల్గతార్, పంజ్‌గూర్ ప్రాంతానికి చెందినవారని పోలీసులు తెలిపారు.