టాంజానియా ఆఫ్రికా దేశాల్లో ఒకటి. ఈ దేశంలోనే ఏకైక బిలియనీర్ మహ్మద్ డ్యూజీ. ఈయన భారత సంతతికి చెందిన కోటీశ్వరుడు. ఇటీవల ఈయన అవహరణకు గురయ్యారు. ఆయన ఆచూకీ కోసం టాంజానియా పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కానీ, రవ్వంత కూడా ఆచూకీ తెలుసుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆచూకీ తెలిపితే రూ.3 కోట్ల మేరకు రివార్డు ఇస్తామని ఆ దేశ పోలీసులు ప్రకటించారు.
ఈ నెల 11వ తేదీన తెల్లవారుజామున వ్యాయామం కోసం దారుసలాంలోని కొలొసియం హోటెల్ వద్దకు రాగానే సాయుధులైన కొందరు దుండగులు ఆయనను కిడ్నాప్ చేశారు. 43 ఏళ్ల ఈ మాజీ రాజకీయనేత, పారిశ్రామికవేత్త. 'మో'గా ప్రసిద్ధి పొందారు. ఆఫ్రికాలోనే అత్యంత పిన్నవయస్కుడైన బిలియనీర్‌గా గుర్తింపు పొందారు.
డ్యూజీ సంపద ప్రస్తుతం 1.5 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ మ్యాగజైన్ పేర్కొంది. ఆయనను టాంజానియాలో ఏకైక బిలియనీర్‌గా వెల్లడించింది. కాగా, ఈయన అపహరణ కేసులో పోలీసులు ఇప్పటి వరకు దాదాపు 20 మందికి పైగా అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.