నల్లజాతీయులకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో నిరసనలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఇంకా నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి వ్యతిరేకంగా ఇటీవల వాషింగ్టన్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో మరోసారి జాతిపిత మహాత్మ గాంధీకి అవమానం జరిగింది.
భారత రాయబార కార్యాలయం ఎదుట ఉన్న విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వాషింగ్టన్ డిసిలో జరిగిన ఈ ఘటనపై భారతీయులు మండిపడుతున్నారు. మహాత్ముడిని అవమానించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిరసనకారుల్లో కొంత మంది వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాని ప్రవాస భారతీయులు డిమాండ్ చేస్తున్నారు.
అయితే వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం వెలుపల ఉన్న గాంధీ విగ్రహం ధ్వంసం కావడంపై అమెరికా రాయబారి కెన్ జస్టర్ భారత్‌కు క్షమాపణలు చెప్పారు. ఇలా జరగడం పట్ల చింతిస్తున్నామన్నారు. క్షమాపణలను స్వీకరించాలని భారత్‌ను ఆయన కోరారు.