Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికా వెళ్లే విద్యార్థులకు ట్రంప్ సర్కారు మరో షాక్

Advertiesment
us visa

ఠాగూర్

, శుక్రవారం, 29 ఆగస్టు 2025 (11:27 IST)
అమెరికాలో విద్యాభ్యాసం చేయాలని భావించే విదేశీ విద్యార్థులకు డోనాల్డ్ ట్రంప్ సర్కారు మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే వీసాలపై పలు ఆంక్షలు అమలు చేస్తున్న అమెరికా.. తాజాగా మరో కీలక సవరణకు ప్రతిపాదనలు చేసింది. విదేశీ విద్యార్థులు తమ దేశంలో ఎక్కువకాలం ఉండిపోకుండా కట్టడి చేసేందుకు వీలుగా కాలపరిమితిని విధించనుంది. విద్యార్థులు, విజిటర్లు, మీడియా ప్రతినిధులకు జారీ చేసే వీసాలకు పరిమిత కాల గడువు విధిస్తూ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. స్టూడెంట్ వీసాపై వచ్చిన వారు నాలుగేళ్లకు మించి అమెరికాలో ఉండకుండా నిబంధనలకు సవరణ చేయనుంది.
 
ప్రస్తుతం ఎఫ్-1, జే-1 వీసాలకున్న 'డ్యూరేషన్ ఆఫ్ స్టే' వెసులుబాటును కుదించనున్నట్లు సమాచారం. ఈ వెసులుబాటు ప్రకారం.. విద్యార్థులు ఎంతకాలం చదవాలనుకుంటే అంతకాలం అమెరికాలో ఉండొచ్చు. ఈ ఫ్లెక్సిబుల్ స్టూడెంట్ వీసాలకు కూడా గడువు విధించేలా 'పరిమిత కాల నివాస అనుమతి'తో కూడిన వీసాలను మంజూరు చేయాలని డిపార్టుమెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించింది. విదేశీ విద్యార్థులకు డ్యూరేషన్ ఆఫ్ స్టే వెసులుబాటు వల్ల భద్రతాపరమైన ఇబ్బందులు, అమెరికన్ల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని పేర్కొంది.
 
అందుకే కొన్ని రకాల వీసాదారుల నివాస అనుమతులపై పరిమితి తీసుకొస్తున్నామని తమ నోటీసుల్లో పేర్కొంది. ఈ ప్రతిపాదనలను ఫెడరల్ రిజిస్ట్రీలో పబ్లిష్ చేయనున్నారు. ఆ తర్వాత ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించి తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రజాభిప్రాయ సేకరణను తప్పించి తక్షణమే అమలు చేసేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశమూ లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మార్పులు అమలులోకి వస్తే ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులపై అధిక ప్రభావం పడే అవకాశం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Mulugu: తెలంగాణలో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. ములుగులో హై అలెర్ట్ (video)