నీటి వివాదాల పరిష్కారానికి గానూ భారత్, పాకిస్థాన్‌ల మధ్య రెండు రోజుల పాటు జరిగే చర్చలు పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో ప్రారంభమయ్యాయి. ఈ చర్చల్లో ముఖ్యంగా ఊలార్ బ్యారేజ్-తుల్‌బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ వివాదం గురించి చర్చించనున్నారు.
చర్చల్లో పాల్గొనేందుకు గానూ నీటి వనరుల కార్యదర్శి ధృవ్ విజయ్ సింగ్ నేతృత్వంలోని భారత అధికారుల బృందం గత రాత్రి పాకిస్థాన్ చేరుకుంది. సింధూ జలాల కమీషనర్ జీ రంగనాథన్ కూడా ఈ బృందంలో సభ్యుడు. పాకిస్థాన్ బృందానికి వాటర్ అండ్ పవర్ సెక్రటరీ జావెద్ ఇక్బల్ సారధ్యం వహిస్తున్నారు.
జమ్ము, కాశ్మీర్‌లోని తుల్‌బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్‌పై పాకిస్థాన్ చేస్తున్న అభ్యంతరాలపై ఇరు దేశాల అధికారులు చర్చించనున్నారు. భారత్ ఈ ప్రాజెక్ట్‌ను 1985లో ప్రారంభించింది. 1960లో భారత్, పాక్‌ల మధ్య చేసుకున్న సింధూ జలాల ఒప్పందాన్ని ఇండియా ఉల్లంఘిస్తున్నదని పాకిస్థాన్ పిర్యాదు చేయడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.