ఏసు క్రీస్తు భార్య మేరీ మగ్దలీనేనా? పురాతన పత్రంలో ప్రస్తావన!!
, గురువారం, 20 సెప్టెంబరు 2012 (12:49 IST)
క్రైస్తవుల ఆరాధ్య దైవం ఏసు క్రీస్తుకు వివహమైందా? ఈయన భార్య పేరు మేరీ మగ్దలీనా? అనే చర్చ మరోమారు తెరపైకి వచ్చింది. క్రీస్తు, మగ్దలీనాల గురించి ఈజిప్షియన్ కాప్టిక్ భాషలో రాసివున్న అత్యంత పురాతన పత్రమొకటి తాజాగా వెలుగుజూసింది. ఇందులో క్రీస్తు, మగ్దలీనాల గురించి ఉంది. చిన్న విజిటింగ్ కార్డు సైజులో ఉన్న ఈ జీర్ణ పత్రం క్రీ.శ. నాలుగో శతాబ్ధం నాటిది. హార్వర్డ్ డివినిటీ స్కూల్‌కు చెందిన డివినిటీ ప్రొఫెసర్ కరేన్ కింగ్ మంగళవారం రోమ్‌లో జరిగిన ఒక సమావేశంలో ఈ పత్రాన్ని ప్రదర్శించారు. దీంతో ఏసుక్రీస్తు బ్రహ్మచారి అవునా కాదా అనే అంశంపై చర్చ ఆరంభమైంది. రోమ్‌లో ప్రదర్శించిన ఆ పత్రంలో ఏముందన్న అంశాన్ని పరిశీలిస్తే.. ఈ చిన్నపాటి పత్రంలో మొత్తం ఎనిమిది లైన్లు ఉండగా, ఇందులో నాలుగో లైనులో.. "జీసస్ వారితో చెప్పాడు.. నా భార్య" అని మాత్రమే ఉంది. ఐదో వరుసలో "ఆమె నా శిష్యురాలిగా ఉండగలదు" అని చెప్పినట్టుగా ఉంది. మరికొన్ని వరుసల తర్వాత "నేను ఆమెతో కలిసి నివశిస్తున్నాను" అని అందులో ఉంది. నిజానికి ఏసుక్రీస్తు వైవాహిక జీవితంపై వివాదాలు చరిత్రలో కొత్తేమి కాదు. గతంలో ప్రచురితమైన ద డావిన్సీ కోడ్ పుస్తకంలో కూడా ఈ తరహా వివాదాలే ఉన్నాయి.