Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోవ్యాగ్జిన్ ప్రయోగాలు ప్రారంభం : 1100 మంది పేర్ల నమోదు

కోవ్యాగ్జిన్ ప్రయోగాలు ప్రారంభం : 1100 మంది పేర్ల నమోదు
, మంగళవారం, 7 జులై 2020 (11:14 IST)
హైదరాబాద్ నగర కేంద్రంగా పని చేస్తున్న ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్, భారత వైద్య పరిశోధనా సంస్థ (ఐసీఎంఆర్) సంయుక్తంగా రూపొందించిన కోవ్యాగ్జిన్ కరోనా రోగులపై ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం 1100 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. తొలి, రెండవ దశల్లో వీరిపై ప్రయోగాలు నిర్వహించనున్నట్టు సంస్థ వెల్లడించింది. 
 
తొలి దశలో 375 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నామని, వారిని 125 మంది చొప్పున మూడు గ్రూపులుగా విభజించి, రెండు డోస్‌లు ఇస్తామని, వారిపై వ్యాక్సిన్ పనితీరు సంతృప్తికరంగా ఉంటే, రెండో దశలో 750 మందిపై ప్రయోగాలు జరుపుతామని తెలియజేసింది.
 
తొలి దశ వ్యాక్సిన్ ఫలితాలను విశ్లేషించేందుకు కనీసం 28 రోజుల సమయం పడుతుందని పేర్కొంది. భారత ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ రావాలంటే, ఈ నెల 18 లోగా తొలి దశ టీకాలను వలంటీర్లకు ఇవ్వాల్సి వుంటుంది. అయితే, తొలి దశ పరీక్షలు విజయవంతమైన వెంటనే వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తారా? అన్న విషయమై స్పష్టత లేదు.
 
వాస్తవానికి ఏదైనా వ్యాక్సిన్‌ను విడుదల చేయాలంటే, మూడు దశల్లో పరీక్షలు జరపాల్సివుంటుంది. ఈ మొత్తం విధానం నెలల తరబడి కొనసాగుతుంది. ట్రయల్స్ నిర్వహించేందుకు ఎంత సమయం పడుతుందని గతంలో మీడియా అడిగిన ప్రశ్నకు, 15 నెలల సమయం పడుతుందని భారత్ బయోటెక్ సమాధానం ఇచ్చింది. ఆపై గత నెల 25న తమ వ్యాక్సిన్, ఎలుకలు, చుంచులు, కుందేళ్లపై విజయవంతమైందని పేర్కొంది. 
 
ఆపై ఫేజ్ 1 హ్యూమన్ ట్రయల్స్ కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతులు కోరగా, అవి లభించాయి. ఇక రెండో దశలో వ్యాక్సిన్ తీసుకున్న వలంటీర్లకు కరోనా సోకిందా? అన్న విషయాన్ని ఆర్టీ-పీసీఆర్ పరీక్షల ద్వారా మాత్రమే నిర్ధారించనున్నారు. కాగా, ఈ వ్యాక్సిన్ పరీక్షలు నిర్వహించేందుకు దేశ వ్యాప్తంగా 12 ఆస్పత్రులను ఐసీఎంఆర్ ఎంపిక చేసిన విషయం తెల్సిందే. వీటిలో హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆస్పత్రి కూడా ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాముకి వున్న పవర్ తెలిస్తే ఈ రోజుల్లో తీసుకోవాల్సిందే...