ఇటీవల చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మందిలో గ్యాస్ సమస్య ఉంటోంది. మసాలాలు ఎక్కువగా తీసుకుంటే గ్యాస్ సమస్యకు అవకాశం ఇచ్చినట్లే. మసాలాలు తీసుకుంటే తప్పనిసరిగా మజ్జిగ తాగాలని చెబుతున్నారు వైద్య నిపుణులు. మజ్జిగలోని లాక్టిక్ ఆమ్లం కడుపులోని గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఇది అసిడిటీ సమస్యను కూడా తగ్గిస్తుంది. అయితే పుల్లటి మజ్జిగ కంటే, తియ్యటి మజ్జిగ తాగడం మేలు చేస్తుంది. పచ్చని తులసి ఆకులను వేడి నీటిలో మరిగించుకుని కాసేపు చల్లార్చి ఆ నీటిని తీసుకోవాలి. ఇలా వారం పది రోజులు చేస్తే గ్యాస్ కొంతవరకైనా తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. గ్యాస్ నుండి ఉపశమనంతోపాటు శరీరానికి వెంటనే శక్తి కావాలంటే కొబ్బరి నీరు తీసుకోండి.
గ్యాస్‌ను నివారించడంలో బెల్లం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. బెల్లంలోని మెగ్నీషియం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కాల్షియంని కూడా అందించి ఎముకలను బలంగా ఉంచుతుంది. ఇకపోతే ఒక కప్పు నీటిని మరిగించి అందులో ఒక స్పూన్ సోంపు వేసి కాసేపు అలానే ఉంచాలి.
ఆ పాత్రకు మూతపెట్టి రాత్రంగా అలానే ఉంచాలి. ఉదయాన ఆ నీటిలో ఒక స్పూన్ తేనె కలుపుకుని తాగండి. ఇలా మూడు పూటలా చేస్తే అసిడిటీ సమస్యను ఎదుర్కోవచ్చని ఆయుర్వేద నిపుణుల సలహా.